సాక్షిప్రతినిధి, వరంగల్: ఈ వారంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వస్తుందనే సంకేతాలు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు అధిష్టానం నుంచి అందినట్లు ప్రచారం జరుగుతోంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సారథ్యంలో 17 మంది సభ్యుల బృందం మంగళవారం హైదరాబాద్‌కు చేరుకోవడం కూడా ఈప్రచారానికి బలం చేకూర్చుతోంది. దీంతో సర్వత్రా ఎన్నికల షెడ్యూల్‌పైనే చర్చ జరుగుతోంది.
దూకుడు పెంచిన ప్రజాప్రతినిధులు, పార్టీలు..
కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో కాలు మోపడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఉమ్మడి వరంగల్‌లో అధికార బీఆర్‌ఎస్‌తోపాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు దూకుడు పెంచారు. ఏ క్షణంలోనైనా ఎన్నికల కోడ్ అమల్లోకి రావొచ్చన్న సంకేతాలతో ఓ అడుగు ముందుకేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు పెట్టుకుంటున్నారు.
దీంతో మంత్రులతోపాటు ముఖ్యమంత్రి సహా అగ్రనేతల పర్యటనలతో జిల్లా హోరెత్తనుంది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఈనెల 6న బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ గ్రేటర్ వరంగల్‌లో పర్యటించనున్నారు. హరీశ్‌రావు, కేసీఆర్ కార్యక్రమాలు కూడా ఉమ్మడి జిల్లాలో ఉండనున్నాయి. అలాగే.. కాంగ్రెస్, బీజేపీలు నియోజకవర్గాల్లో పర్యటనలు, కార్యక్రమాలను మంగళవారం నుంచి మరింత ముమ్మరం చేశాయి. ఇప్పటికే దరఖాస్తుల చేసుకుని టికెట్ల కోసం ఎదురు చూస్తున్న ఆ రెండు పార్టీల అభ్యర్థుల జాబితా త్వరలోనే వెలువడనుందన్న ధీమాను పార్టీల నేతలు వ్యక్తం చేస్తున్నారు.
సర్వసన్నద్ధంగా అధికార యంత్రాంగం..
ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చినా.. ఎన్నికలు జరిపేలా ఉమ్మడి వరంగల్‌లోని 12 నియోజకవర్గాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. సుమారుగా 27.89 లక్షల పైచిలుకు ఓటర్ల కోసం 3,252 పోలింగ్ కేంద్రాలు, 5,890ల వరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) సిద్ధం చేసినట్లు కూడా ప్రకటించారు.
సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాల మార్కింగ్ చేశారు. జిల్లా కలెక్టరేట్లలో ఎన్నికల కేంద్రాలు, మీడియా సెంటర్‌లను ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లతో పాటు ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన విధానాలపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉమ్మడి వరంగల్‌కు చెందిన అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు మంగళవారం హైదరాబాద్‌కు వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment