సాక్షిప్రతినిధి, వరంగల్: అధికార పార్టీ బీఆర్‌ఎస్‌లో గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టే పనిలో నిమగ్నమయ్యారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. జనగామ జగడానికి, స్టేషన్ ఘన్‌పూర్‌లో మాటల యుద్ధానికి తెరదించేందుకు ప్రగతిభవన్‌ను వేదిక చేశారు. పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్న నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు మంతనాలు జరిపారు.
ఈ మేరకు కేటీఆర్.. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో భేటీ అయి ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. షేక్ హ్యాండ్ ఇప్పించి ఐక్యతను చాటిచెప్పారు. అటు జనగామ అభ్యర్థి ఎవరనే అంశంపై సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో మాత్రమే భేటీ అయి సస్పెన్స్‌కు తెరదించే పనిలో నిమగ్నమయ్యారు.
ముందు విడివిడిగా.. తర్వాత కలిపి..
శుక్రవారం ఉదయం ప్రగతిభవన్‌కు చేరుకున్న కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యతో కేటీఆర్ మొదట విడివిడిగా మాట్లాడి.. ఆ తర్వాత ఇద్దరిని కలిపి మాట్లాడినట్లు తెలిసింది. పార్టీకి ఉన్న సమాచారం, సర్వేల ప్రకారం కొన్నిచోట్ల మార్పులు అనివార్యమైందని, ఈ నేపథ్యంలో సీఎం నిర్ణయం తీసుకున్నారని.. అందరూ కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థులను గెలిపించాలని సూచించినట్లు తెలిసింది.
భేటీ అనంతరం రాజయ్య, కడియం శ్రీహరిలు కేటీఆర్ సమక్షంలో చేయి చేయి కలిపి కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి ఎమ్మెల్యే రాజయ్య సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తనకు మద్దతు ప్రకటించడంపై రాజయ్యకు కడియం శ్రీహరి ధన్యవాదాలు తెలపడంతో స్టేషన్ ఘన్‌పూర్ వివాదానికి తెరపడినట్లయ్యింది.
మొత్తబడని ‘ముత్తిరెడ్డి’..
నేటినుంచి జనగామలో పర్యటన..
జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితోనూ మంత్రి కేటీఆర్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. రాత్రి వరకు ప్రగతి భవన్‌లోనే ఉన్న యాదగిరిరెడ్డి జనగామ టికెట్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేనట్లు వ్యవహరించినట్లు సమాచారం. ఇదే సమయంలో సీఎం కేసీఆర్‌ను కూడా ఆయన కలిసినట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో కేటీఆర్‌తో భేటీ అనంతరం వేర్వేరుగా తిరుగు పయనమైన ఎమ్మెల్యేలు రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆ వివరాలను ముఖ్యనేతలు, మీడియాతో వెల్లడించేందుకు నిరాకరించారు. సెల్‌ఫోన్‌లు రాత్రి వరకు స్విచ్ఛాఫ్ చేసుకున్నారు.
అంతకుముందు తన వ్యక్తిగత కార్యదర్శితో మాట్లాడిన ఎమ్మెల్యే రాజయ్య ‘నేను హనుమకొండకు వస్తున్నా..’నని మాత్రమే చెప్పారట. ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి అయితే ‘నేను శుక్రవారం రాత్రికే జనగామ చేరుకుంటా.. శనివారం ఉదయం నుంచి నియోజకవర్గంలో యథావిధిగా పర్యటనలు, కార్యక్రమాలు ఉంటాయి’ అని ముఖ్య అనుచరులకు సమాచారం ఇచ్చారు.
త్వరలో కీలక నిర్ణయాల ప్రకటన..
ప్రగతిభవన్‌లో చర్చల అనంతరం గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టే పనిలో పడిన కేటీఆర్ త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటారన్న చర్చ జరుగుతోంది. సోమవారం నాటికి జనగామకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఖరారు అవకాశం ఉందన్న మరో చర్చ కొందరు పార్టీ ముఖ్యనేతల్లో మొదలైంది. బీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి పనిచేసి అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన వారికి సముచిత స్థానం ఉంటుందన్న కేటీఆర్.. ముత్తిరెడ్డి, తాడికొండ రాజయ్యకు ఆర్టీసీ చైర్మన్, రైతు బంధు సమితి చైర్మన్ పదవులను ఇవ్వనున్నట్లు కూడా చెప్పినట్లు ప్రచారం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment