స్మార్ట్ ట్రబుల్
వరంగల్ అర్బన్: కన్నెత్తి చూడని ఉన్నతాధికారులు. మాకేంటి అన్నట్లుగా ప్రజాప్రతినిధులు. టెండర్ అగ్రిమెంట్, గడువులతోనైతే సంబంధమే లేదు. నోటీసులు చిత్తు కాగితాలే.. అన్నట్లుగా వ్యవహరిస్తోంది కాంట్రాక్ట్ ఏజెన్సీ సంస్థ. ఫలితంగా వరంగల్ తూర్పులోని 9 చోట్ల స్మార్ట్ సిటీ రోడ్డు పనులు అసంపూర్తిగా,ఆగమ్యగోచరంగా మారాయి. అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టులు పూర్తి చేసే గడువు ఐదేళ్లు దాటినా, రాష్ట్ర ప్రభుత్వం చొరవతో కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ పనులు పూర్తి చేసేందుకు 9 నెలల గడువు పొడిగించగా సగం కాలం గడిచింది. వదిలేసిన అసంపూర్తి పనులు గడువులోగా పూర్తి చేస్తారా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఆకర్షణీయమేది?
స్మార్ట్‌సిటీ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. సప్లమెంటరీలో వరంగల్‌కు ఆకర్షణీయ నగరంగా చోటు దక్కింది. అనేక ప్రాజెక్టుల్లో భాగంగా నగరంలో ప్రధాన రహదారులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు రెండో విడతలో 2020లో 11 రోడ్లు రూ. 52.49 కోట్లతో ప్రతిపాదించారు. కాగా.. పది కాలాల పాటు మన్నాల్సిన పనులు ఇష్టారాజ్యంగా మారాయి. సగానికి పైగా సీసీ రోడ్లు, మరో సగం తారు రోడ్లు నిర్మించారు. ఇక రోడ్డుకు ఇరువైపులా హనుమకొండలో నిర్మించిన స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనుల తరహాలో డక్ట్‌లు నిర్మించాల్సి ఉంది. భూగర్భ డ్రెయినేజీకి పైపులైన్లు ఏర్పా టు చేశారు. వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి చౌరస్తా మీదుగా పోచమ్మమైదాన్ వరకు రోడ్డు మధ్యలో డివైడర్ నిర్మించాల్సి ఉంది. కొంత మేరకు నిర్మించి మధ్యలోనే కూల్చివేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే అప్పుడున్న ఎమ్మెల్యేలు, మేయర్, కమిషనర్, ఇంజినీర్లతో జరిగిన ఒప్పందం మేరకు పనులు చేపట్టినట్లు సదరు ఏజెన్సీ సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు. భూగర్భ డ్రెయినేజీ పైపులైన్ల అనుసంధానం అక్కడక్కడా పూర్తి చేయలేదు. పైపులైన్లపై పలు చోట్ల చాంబర్ల మూతలు బిగించలేదు. పుట్‌పాత్‌ల కోసం రోడ్డుకు ఇరువైపులా.. మార్కింగ్ ఇచ్చి సీసీ బ్రిక్స్ నిర్మించారు. కానీ.. ఫుట్‌పాత్‌ల నిర్మాణం చేపట్టలేదు. అస్తవ్యస్తంగా వదిలేసిన ఫుట్‌పాత్‌లపై వ్యాపారులు చాలా చోట్ల కొందరు మెట్లు నిర్మించుకోగా.. మరికొందరు సీసీతో పూడ్చివేశారు. డెకరేటివ్ లైటింగ్ కోసం పోల్స్ ములుగు రోడ్డు నుంచి అక్కడక్కడా పోచమ్మ మైదాన్, కాశిబుగ్గ, ఎస్‌ఎన్‌ఎం క్లబ్ వరకు ఏర్పాటు చేశారు. పలు చోట్ల లైట్లను బిగించారు కానీ.. వెలగడం లేదు. మిగతా రోడ్లలో డెకరేటివ్ పోల్స్ వేసి, లైట్లు ఏర్పాటు చేయలేదు. పెడిస్ట్రేషన్ క్రాసింగ్‌లు తదితర పనులు చాలా మేరకు పెండింగ్‌లో ఉన్నాయి.
అంతా మా ఇష్టం..
స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులను పరిశీలించేందుకు రాష్ట్ర పురపాలక శాఖ ఓ ప్రైవేట్ సంస్థను నియమించింది. ప్రాజెక్టుల మానిటరింగ్ కమిటీ (పీఎంసీ) ఇంజనీర్లు, నిపుణులు సైతం పనులు పరిశీలించాలి. కానీ క్షేత్రస్థాయిలో ఈ విధానం ఎక్కడా అమలు కావడం లేదు. సీసీ రోడ్ల పనులు జరిగిన కొన్ని నెలలకే కంకర తేలి, గుంతలు పడ్డాయి. ఇవేంటని ప్రశ్నిస్తే పూడ్చివేశారు. అసంపూర్తి అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పైప్‌లైన్లు వేసి, చాంబర్ల లింకులను కలపకపోవడంతో వ్యాపారులు, వినియోగదారులు, వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షం కురిసిందంటే ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీగా గుంతలు కలిగి ఉన్న చాంబర్ల వద్ద కనీసం రక్షణ చర్యలు, ప్రమాద హెచ్చరికలు లేకపోపోవడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రహదారులకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లు నిర్మించకపోవడంతో వాహనదారులు రోడ్డుపై వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో పాదచారులు రోడ్డుపై నడవాల్సి వస్తోంది. అంతేకాకుండా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న ఒకతను తన పవర్‌ను ఉపయోగించి.. తన బంధుగణానికే ఈ పనులు కట్టబెట్టినట్లు ఆరోపణలున్నాయి. అతడి ఎమ్మెల్యే పదవి పోయినప్పటికీ బల్దియా ఇంజనీర్లు, ప్రజాప్రతినిధులు అటువైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
టెండర్ రద్దు చేశాం..
వరంగల్‌లో 9 స్మార్ట్‌సిటీ రోడ్ల పనులు గడువులోగా పూర్తి చేయాలని పలుమార్లు ఏజెన్సీకి నోటీసులు జారీ చేశాం. స్పందించకపోవడంతో బోర్డుకు నివేదిస్తే రద్దు చేశారు. తిరిగి టెండర్ నిర్వహించేందుకు ఈఎన్‌సీకి లేఖ రాశాం. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరలో పూర్తి చేయిస్తాం.
– ప్రవీణ్ చంద్ర, బల్దియా ఎస్‌ఈ
అస్తవ్యస్తంగా అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ సిస్టమ్
ఫుట్‌పాత్‌లు లేక నడకదారుల్లో
నరకయాతన
ప్రజా ప్రయోజనాలు పట్టించుకోని
పాలకులు, ఉన్నతాధికారులు
అసంపూర్తి పనులు ఎక్కడెక్కడంటే..
వరంగల్ ములుగు రోడ్డు నుంచి ఎంజీఎం సెంటర్ వరకు రోడ్డు, డ్రెయినేజీ, ఫుట్‌పాత్, డెకరేటివ్ లైటింగ్, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, సెంట్రల్ డివైడర్ నిర్మించాల్సి ఉంది.
ఎంజీఎం సెంటర్ నుంచి పోచమ్మమైదాన్
కాశిబుగ్గ, వెంకట్రామా థియేటర్ వరకు..
వెంకట్రామ థియేటర్ నుంచి వరంగల్ ఆర్టీసీ బస్ స్టేషన్ అక్కడి నుంచి హెడ్ పోస్టాఫీస్ వరకు..
వరంగల్ రాంకీ ఎన్‌క్లేవ్ నుంచి ఎస్‌ఎన్ క్లబ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు.
వరంగల్ చౌరస్తా నుంచి హెడ్ పోస్టాఫీస్ వరకు.
హెడ్ పోస్టాఫీస్ నుంచి హంటర్ రోడ్డు వరకు.
చౌరస్తా నుంచి మేదరి వాడ హంటర్ రోడ్డు వరకు.
ఆర్‌ఎన్‌టీ రోడ్డు, వరంగల్ చౌరస్తా నుంచి పోచమ్మమైదాన్ వరకు సుమారు 8.68 కిలో మీటర్ల మేరకు పనులు పూర్తి చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment