53 శాతం మంది హాజరు
విద్యారణ్యపురి/వరంగల్: గ్రూప్–3 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. హనుమకొండ, కాజీపేట, హసన్‌పర్తి మండలాల పరిధిలో 83 సెంటర్లు ఏర్పాటు చేయగా.. అభ్యర్థులు నిర్దేశించిన సమయానికి ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు జరిగిన మొదటి పేపర్ పరీక్షకు 32,864 మంది అభ్యర్థులు 17,572(53.47శాతం) హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌లో 3 నుంచి 5.30 గంటలవరకు జరిగిన పేపర్–2 పరీక్షకు 17,437(53.06శాతం) మంది హాజరయ్యారు. అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతించారు. హనుమకొండలోని శ్రీనివాస గురుకుల్ ఉన్నత పాఠశాల సెంటర్‌ను కలెక్టర్ ప్రావీణ్య సందర్శించి పరీక్ష తీరును పరిశీలించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఇదిలా ఉండగా.. ఈనెల 18న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించే పేపర్–3 పరీక్షతో గ్రూప్–3 పరీక్షలు ముగియనున్నాయి.
వరంగల్‌లో..
వరంగల్ జిల్లా వ్యాప్తంగా 28 కేంద్రాల్లో ఆదివారం జరిగిన గ్రూప్–3 పరీక్షలకు 10,913 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. ఉదయం మొదటి పేపర్ పరీక్షకు 5,513 మంది, మధ్యాహ్నం రెండో పేపర్ పరీక్షకు 5,489 మంది హాజరైనట్లు కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. ఆమె వాగ్దేవి కళాశాల, తాళ్ల పద్మావతి కళాశాల, సిల్వర్ క్రౌన్ ఉన్నత పాఠశాల కేంద్రాలను సందర్శించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, రీజినల్ కోఆర్డినేటర్ బత్తిని చంద్రమోహన్, సహాయ రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ సురేశ్‌బాబు, జిల్లా బయోమెట్రిక్ ఆఫీసర్ డాక్టర్ శ్యాం తదితరులు ఉన్నారు.
గ్రూప్–3 పరీక్షలు ప్రారంభం
సెంటర్లను తనిఖీ చేసిన కలెక్టర్లు
Comments
Please login to add a commentAdd a comment