శామీర్‌పేట్: వివాహేతర సంబంధం నేపథ్యంలో కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. ఓ వ్యక్తి భార్యతో కలసి ఉంటున్న వ్యక్తి.. పిల్లల కోసం వచ్చిన ఆమె భర్తపై ఎయిర్‌గన్‌తో కాల్పులు జరిపాడు. శనివారం హైదరాబాద్ శివార్లలోని శామీర్‌పేటలో ఉన్న సెలబ్రిటీ రిసార్ట్స్‌లో ఈ ఘటన జరిగింది. బాలానగర్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నంలోని హిందూజా థర్మల్ పవర్ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న సిద్ధార్థ్ దాస్‌కు ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే గ్రంథి స్మితతో కొన్నేళ్ల కింద వివాహం జరిగింది.
వారికి 17 ఏళ్ల కుమారుడు, 13 ఏళ్ల కుమార్తె ఉన్నారు. మనస్పర్థల కారణంగా సిద్ధార్థ్, స్మిత నాలుగేళ్లుగా విడివిడిగా ఉంటున్నారు. విడాకుల కేసు కోర్టులో నడుస్తోంది. స్మిత కొన్నేళ్ల కింద పరిచయమైన మనోజ్‌తో కలసి శామీర్‌పేట సెలబ్రిటీ రిసార్ట్స్‌లోని విల్లా నంబర్ 21లో సహజీవనం చేస్తున్నారు. ఇన్నాళ్లుగా ఇద్దరు పిల్లలు స్మిత దగ్గరే ఉన్నారు.
చెల్లిని హింసిస్తున్నారని కుమారుడు చెప్పడంతో..
ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సిద్ధార్థ్ దాస్.. కోర్టు ఆదేశాలతో తన కుమారుడిని ఈ నెల 12న విశాఖపట్నానికి తీసుకెళ్లాడు. ఈ సందర్భంగా తల్లి స్మిత, ఆమె ప్రియుడు మనోజ్ కలిసి తనను, చెల్లిని తీవ్రంగా హింసించిన విషయాన్ని తండ్రి సిద్ధార్థ్‌కు కుమారుడు వివరించాడు. దీంతో బాధపడిన సిద్ధార్థ్.. శనివారం ఉదయం సెలబ్రిటీ రిసార్ట్స్‌లోని విల్లా వద్దకు వెళ్లి కుమార్తెను తనతో పంపించాలని కోరాడు.
దీనిపై వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో అక్కడే ఉన్న మనోజ్ రెచ్చిపోయి.. ఎయిర్‌గన్‌తో సిద్ధార్థ్‌దాస్‌పై కాల్పులు జరిపాడు. వాటి నుంచి తప్పించుకున్న సిద్ధార్థ్ డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వెంటనే విల్లా వద్దకు చేరుకుని ఎయిర్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి ముగ్గురిని విచారిస్తున్నారు. మనోజ్ కంటే స్మిత వయసులో పెద్దదని, వారి మధ్య వివాహేతర సంబంధం ఆరోపణలు సరికాదని.. ఒక దగ్గర కలిసుంటే వివాహేతర సంబంధం ఉన్నట్లేనా? అని మనోజ్ తండ్రి పేర్కొన్నారు.
(చదవండి: శామీర్‌పేట్ ఘటనలో ఊహించని ట్విస్ట్.. ఈ కేసుతో సంబంధం లేదన్న నటుడు)
కాల్పుల ఘటనతో వెలుగులోకి మోసాలు
ఈ కాల్పుల ఘటనపై మనోజ్, స్మితలను విచారిస్తున్న సమయంలో.. వారు పలు మోసాలకు పాల్పడిన విషయాన్ని పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. మనోజ్, స్మిత కలసి.. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ సంపన్న వర్గాల అమ్మాయిలకు ఎరవేస్తున్నట్టు తేల్చినట్టు సమాచారం. ఇలా ఇటీవలే ఓ సంపన్న యువతి నుంచి రూ.50 లక్షలు వసూలు చేశారని గుర్తించినట్టు సమాచారం.
ఈ ఆరోపణలకు సంబంధించి కూడా దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు చెప్తున్నారు. ఇక సిద్ధార్థ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనోజ్‌పై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న గన్‌లో ఎలాంటి మందు గుండు సామాగ్రి, ఉంది? కాల్పులు జరిపారా? లేదా అన్నదాన్ని నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment