కేటుగాళ్లతో ఖాకీల సెటిల్‌మెంట్లు | - | Sakshi
Sakshi News home page

కేటుగాళ్లతో ఖాకీల సెటిల్‌మెంట్లు

Published Mon, Aug 28 2023 11:54 AM | Last Updated on Mon, Aug 28 2023 12:39 PM

- - Sakshi

హైదరాబాద్.. అదేంటి? కొట్టేసిన సొమ్మును సైబర్‌ నేరస్తులు తిరిగి రీ ఫండ్‌ చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా? అక్కడే ఉంది అసలు మ్యాజిక్కు!! ‘రీ ఫండ్‌’ తెర వెనక అసలేం జరిగిందంటే..

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు... సాంకేతిక ఆధారాలతో సైబర్‌ నేరస్తుల ఏ బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ అయ్యిందో గుర్తించారు. నిందితుడు ఢిల్లీలో ఉన్నట్లు నిర్ధారించుకుని, అక్కడికి వెళ్లి 2–3 రోజులు గాలించి నేరస్తుడిని పట్టుకున్నారు. బాధితురాలి నుంచి కొట్టేసిన సొమ్మును రీ ఫండ్‌ చేస్తే వదిలేస్తామని నిందితుడితో సెటిల్‌మెంట్‌ చేశారు. దీంతో కేటుగాడు బాధితురాలి ఖాతాకు నగదును బదిలీ చేశాడు. అరెస్టు, కేసులు లేకుండా చేసినందుకు నిందితుడి నుంచి సదరు పోలీసులు డబ్బు వసూలు చేశారు. హైదరాబాద్‌ తిరిగి వచ్చిన తర్వాత బాధితురాలికి న్యాయం జరిగిందనే కోణంలో లోక్‌ అదాలత్‌లో రాజీ కుదిర్చి, కేసును విత్‌డ్రా చేయించారు.

‘లెక్క’ చెప్తేనే దర్యాప్తు..
సాధారణంగా కేసు నమోదు, రిమాండ్‌ రిపోర్టు, చార్జ్‌షీట్‌ దాఖలు వంటి అధికారం సివిల్‌ పోలీసులకు ఉంటుంది. కానీ, రాచకొండ సైబర్‌ క్రైమ్‌లో మాత్రం ఇతర విభాగానికి చెందిన పోలీసులదే హవా. ఏ కేసు నమోదు చేయాలి, దర్యాప్తు చేయాలనే నిర్ణయం కూడా వీళ్లదే అంటే అతిశయోక్తి కాదు. ఇతర రాష్ట్రాల్లో దాక్కున్న సైబర్‌ నేరస్తులను పట్టుకొచ్చేందుకూ సివిల్‌ పోలీసులు కాకుండా వీరే వెళ్లడం, సెటిల్‌మెంట్లు చేయడం పరిపాటిగా మారింది. మోసపోయామని ఠాణా మెట్లు ఎక్కే బాధితులతోనూ ‘లెక్క’ మాట్లాడుకున్న తర్వాతే కేసు దర్యాప్తు ముందుకు సాగుతుందని, లేకపోతే నిందితులు దొరకడం లేదని 2–3 నెలల తర్వాత కేసులను క్లోజ్‌ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏళ్లుగా ఒక్కచోటే తిష్ట..
సాధారణంగా పోలీసు విభాగంలో దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేసే వారికి స్థానచలనం ఉంటుంది. అయితే సైబర్‌ క్రైమ్‌లో మాత్రం ఐదేళ్లకు మించి కానిస్టేబుళ్లు, రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు పనిచేస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవటం గమనార్హం. ఐదేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్న ఐదుగురు కానిస్టేబుళ్లను ఇటీవల వేరే స్టేషన్‌కు బదిలీ చేశారు అయితే కనీసం రిలీవ్‌ ఆర్డర్‌ కూడా చేతికి అందకముందే ‘పెద్దల’ అండదండలతో మళ్లీ అక్కడే పోస్టింగ్‌ తెచ్చుకోవటం వీరికే చెల్లింది.

‘కొన్ని నెలల క్రితం రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ఓ ఐటీ ఉద్యోగిని సైబర్‌ నేరస్తుల వలలో చిక్కి... రూ.లక్షల్లో మోసపోయింది. దీంతో ఆమె సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. తాజాగా సదరు బాధితురాలు ఠాణాకు వచ్చి తాను మోసపోయిన సొమ్ము తిరిగి ఖాతాలో జమైందని, కేసు ఉపసంహరించుకుంటానని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులే దగ్గరుండి మరీ లోక్‌ అదాలత్‌లో రాజీ కుదిర్చారు.’

ఏఆర్‌ టీంను రిటర్న్‌ చేయాలని నిర్ణయించాం
– అనురాధ, డీసీపీ, రాచకొండ సైబర్‌ క్రైమ్‌

ప్రస్తుతం రాచకొండ సైబర్‌ క్రైమ్‌లో నాతో సహా ఇద్దరు ఏసీపీలు కూడా కొత్తగా వచ్చారు. వారు సైబర్‌ క్రైమ్‌ల దర్యాప్తు, ఇతరత్రా అంశాలపై సాంకేతికంగా పట్టు సాధించాల్సి ఉంది. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న ఏఆర్‌ టీంను వెనక్కి పంపించాలని నిర్ణయించాం. కొన్ని సైబర్‌ క్రైమ్‌ కేసుల్లో బాధితురాలికి తెలియకుండా వారి కుటుంబ సభ్యులే సైబర్‌ మోసం చేసినట్లు దర్యాప్తులో గుర్తించాం. ఇలాంటి కేసులలో బాధితుల విజ్ఞప్తి మేరకు విత్‌డ్రా చేస్తున్నాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement