హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీ పథకాల్లో భాగంగా ‘రూ.500కు వంటగ్యాస్’ ఆశ నిరాశగా తయారైంది. ప్రభుత్వం ఈ నెల 28 నుంచి నిర్వహించతలపెట్టిన ప్రజాపాలనలో గ్యారంటీ పథకాల కింద దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో సబ్సిడీ వంట గ్యాస్‌పై ఆశలు చిగురిస్తున్నా.. రేషన్‌కార్డుతో మెలిక ఆందోళన కలిగిస్తోంది. ఆరు గ్యారంటీ పథకాల్లో ఒకటైన మహాలక్ష్మి పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువనున్న (రేషన్ కార్డు) కలిగిన నిరపేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్ వర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే ప్రభుత్వం గ్యారంటీ పథకాల దరఖాస్తులకు తెల్ల రేషన్ కార్డులతో ముడి పెట్టింది. మహానగర పరిధిలోని గృహోపయోగ వంట గ్యాస్ కనెక్షన్‌దారుల్లో సగానికి పైగా కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు. గత పదేళ్లలో అనేక కుటుంబాల్లోని సభ్యులు వివాహాలతో వేరు పడగా, మరోవైపు కొత్త రేషన్ కార్డు మంజూరు మొక్కుబడిగా పరిమితం కావడం రేషన్ కార్డులు లేని కుటుంబాలు సంఖ్య బాగా పెరిగింది. అది కాస్తా సబ్సిడీ వంట గ్యాస్‌కు సమస్యగా తయారు కానుంది.
ఆ కుటుంబాల మాటేమిటో..?
గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలో సుమారు 30 లక్షల పైనే వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు చమురు సంస్థల అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉపాధి, ఇతరత్రా అవసరాల కోసం వలస వచ్చిన కుటుంబాలతో మరో పది లక్షల అనధికార కనెక్షన్లు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు 17.21 లక్షలు ఉన్నాయి. మిగిలిన కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు. ఇందులో దారిద్య్ర రేఖకు దిగవనున్న (బీపీఎల్) కుటుంబాలు మరో పది లక్షల వరకు ఉండవచ్చని అంచనా. మిగిలినవి దారిద్య్ర రేఖకు ఎగువనున్న (ఏపీఎల్) కుటుంబాల కనెక్షన్లు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం రేషన్ కార్డులు లేని కుటుంబాలు సబ్సిడీ వంట గ్యాస్‌కు అర్హత పొందే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఈ వర్గంలో ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం సిలిండర్ ధర రూ.955
ప్రస్తుతం చమురు సంస్థల అధీకృత డీలర్ల ద్వారా సరఫరా అవుతున్న 14.5 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర బహిరంగ మార్కెట్ ప్రకారం రూ.955 పలుకుతోంది. గృహ వినియోగదారులు సిలిండర్ ధరను పూర్తిగా చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం చమురు సంస్థల ద్వారా సిలిండర్ ధర ఎంత పలికినా.. రాయితీ మాత్రం రూ. 40.71కు పరిమితం చేసి నగదు బదిలీ కింద వినియోగదారుల ఖాతాలో జమ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీ పథకమైన మహాలక్ష్మి కింద అర్హత పొందితే కేవలం రూ.500కే సిలిండర్ వర్తించే అవకాశాలు ఉన్నాయి.
మరో వైపు ఈ– కేవైసీ
మరోవైపు వంటగ్యాస్ కనెక్షన్లకు ఈ–కేవైసీ అనుసంధానం ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. పదిహేను రోజులుగా వంట గ్యాస్ వినియోగదారులు ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. ఈ–కేవైసీ పూర్తి చేసుకోకపోతే సబ్సిడీ సిలిండర్ రాదన్న వదంతులతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. దీంతో గ్యాస్ ఏజెన్సీల ముందు భారీగా క్యూ కడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీలు మాత్రం కేవలం ఈ–కేవైసీ పూర్తి కాని వారికి మాత్రమే చేస్తున్నామని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment