కంటోన్మెంట్: నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి వాచ్‌మన్ మృతి చెందగా.. యజమానులు మృతదేహాన్ని సమీపంలోని చెత్త కుప్పల్లో పడేసిన ఘటన బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బోయిన్‌పల్లి ఇన్‌స్పెక్టర్ లక్ష్మీ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ముంజంపల్లి యాకయ్య (55), సావిత్రి దంపతులు ఉపాధి కోసం నగరానికి వచ్చి అంజయ్య నగర్‌లో నివాసముంటున్నారు.
యాకయ్య మనోవికాస్ నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద వాచ్‌మన్‌గా పని చేస్తున్నారు. సోమవారం సాయంత్రం క్యూరింగ్ నిమిత్తం నీళ్లు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి పడి జారిపడి ఆయన మృతి చెందారు. కొద్దిసేపటి తర్వాత గమనించిన భవన యజమాని జహంగీర్ కుటుంబ సభ్యులు ఎవరికీ అనుమానం రాకుండా సమీపంలోని చెట్ల పొదల్లో యాకయ్య మృతదేహాన్ని పడేశారు. మృతుడి భార్య యజమానులను ఆరా తీసినప్పటికీ, తమకేమ తెలియదని బుకాయించారు.
అంజయ్యనగర్ దారిలో వెళ్లే వాహనదారులు, యాకయ్య మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి వివరాలు కనుక్కున్న పోలీసులు, భవన యజమానిపై అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించడంతో వాస్తవాన్ని అంగీకరించారు. భవనం వద్ద ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలో నిక్షిప్తం అయిన దృశ్యాలను పోలీసులు పరిశీలించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment