ముఖంపై గాటు, క్రూరమైన చూపులు, హుందాగా వ్యవహరించే తీరు.. వెరసి విలక్షణమైన లక్షణాలతో గుర్తింపు పొందిన ఆఫ్రికన్ సింహం ‘స్కార్‌ఫేస్’ ఇక లేదు. 14 ఏళ్ల మగ సింహం.. అనారోగ్యంతో చనిపోయినట్లు సఫారీ నిర్వాహకులు ధృవీకరించారు. కెన్యాలోని మసాయి మారా గేమ్ రిజర్వ్‌లో ఇది ఇంతకాలం బతికింది.
కాగా, కుడికన్ను పక్కన గాటుతో ఉండే ఈ సింహాన్ని.. లయన్‌కింగ్ దుష్ట సింహం ‘స్కార్’ క్యారెక్టర్‌తో పోలుస్తుంటారు చాలా మంది. ఇదే టూరిస్టుల్లో ఈ సింహానికి గుర్తింపు తెచ్చిపెట్టింది. చనిపోయే ముందు అది తాను పుట్టిన ప్రాంతంవైపు నడిచిందని, దురదృష్టవశాత్తూ గమ్యానికి 15 కిలోమీటర్ల అది చనిపోయిందని సఫారీ నిర్వాహకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో స్కార్‌ఫేస్ మీద బీబీసీ, నేషనల్ జియోగ్రఫిక్, హిస్టరీ లాంటి చానెల్స్ ఎన్నో డాక్యుమెంటరీలను తీశాయి కూడా.
సెన్సేషన్ పిగ్ కూడా..
చైనా హీరో పిగ్ ఇక లేదు. జూన్ 14న అది చనిపోయినట్లు దాని సంరక్షకులు వైబో ద్వారా ప్రకటించారు. 2008లో చైనా భారీ భూకంపం తర్వాత ఓ భారీ పంది ఫేమస్ అయ్యింది. సిచువాన్ ప్రావిన్స్‌లో దాదాపు 36 రోజుల తర్వాత శకలాల నుంచి అది ప్రాణాలతో బయటపడడం అందరినీ ఆశ్చర్యపరిచింది. జు జియాంగియాంగ్ అనే పేరుతో జనాలు ముద్దుగా పిల్చుకునే ఆ పంది.. అన్నిరోజులపాటు వర్షం నీళ్లు, కాల్చిన బొగ్గు తిని అంతకాలం ప్రాణాల్ని నిలబెట్టుకోగలిగింది. విపత్కరకాలంలో ఎలా బతకాలో జియాంగియాంగ్‌ను చూసి నేర్చుకోవాలని పేర్కొంటూ చైనావాళ్లు దానిని ‘హీరోయిక్ పిగ్’గా ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ తర్వాత ఓ మ్యూజియం నిర్వాహకులు ఇంతకాలం దాని సంరక్షణ చూస్తూ వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment