నేడు అమెరికాలోని కుపర్టినో సిటీలో ఆవిష్కరణ
పుస్తకం హస్తభూషణం అనేది పాత మాట. చేతికో చక్కని స్మార్ట్‌ఫోన్ అనేది నవతరం మాట. మెరుపువేగంతో ఇంటర్నెట్, స్పష్టమైన తెరలు, అదిరిపోయే సౌండ్, వేగంగా పనికానిచ్చే చిప్, రామ్‌లుండే కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ కోసం జనం ఎగబడటం సర్వసాధారణమైంది. మార్కెట్లోకి కొత్త ఫోన్ వస్తోందంటే చాలా మంది దాని కోసం వెయిట్ చేస్తారు.
అందులోనూ యాపిల్ కంపెనీ వారి ప్రపంచ ప్రఖ్యాత ఐఫోన్ సిరీస్‌లో కొత్త మోడల్ వస్తోందంటే టెక్ ప్రియులంతా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారు. వారి నిరీక్షణకు శుభం పలుకుతూ నేడు అమెరికాలోని కుపర్‌టినో నగరంలో ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను యాపిల్ ఆవిష్కరిస్తోంది. తమ సంస్థ కొత్త ఉత్పత్తులు, వాటి ఫీచర్లకు సంబంధించి యాపిల్ ఏటా యాపిల్ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా దీనికి విశేషమైన క్రేజ్ ఉంది.
ఏటా సెప్టెంబర్ రెండో వారంలో యాపిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం తెల్సిందే. యాపిల్ ఇన్నేళ్లలో వందల కోట్ల ఐఫోన్లను విక్రయించింది. అయితే కొత్త మోడల్ తెచ్చినప్పుడు దాంట్లో చాలా స్వల్ప స్థాయిలో మార్పులు చేసి కొత్తగా విడుదలచేసింది. దాంతో పెద్దగా మార్పులు లేవని తెలిసి ఇటీవలి కాలంలో యాపిల్ ఫోన్ల విక్రయాలు ప్రపంచవ్యాప్తంగా స్వల్పంగా తగ్గాయి. దీంతో యాపిల్ ఈసారి కృత్రిమ మేథ మంత్రం జపించింది.
కొత్త సిరీస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఎక్కువగా వాడినట్లు వార్తలొచ్చాయి. దీంతో 17 ఏళ్లలో తొలిసారిగా ఐఫోన్‌లో విప్లవాత్మక మార్పులు చేసుకోబో తున్నట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియా లోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో జరిగే యాపిల్ ఈవెంట్ యూట్యూబ్‌లో ప్రత్యక్షప్రసారంకానుంది. ఐఫోన్ 16, ఐఫోన్ ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ మోడళ్లను ఆవిష్కరించే అవకాశం ఉంది. ఐఓస్ 18తో పాటు ఇతర సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇచ్చే ఛాన్సుంది.
16 సిరీస్ మోడళ్లలో యాక్షన్ బటన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రో మోడల్స్‌లో మాత్రమే యాక్షన్ బటన్ ఇచ్చారు. కొత్త తరం హార్డ్‌వేర్, ఏఐతో రూపొందిన ఐఫోన్లు యూజర్లను తెగ ఆకట్టుకుంటాయని యాపిల్ సంస్థ భావిస్తోంది. కొత్త ఏఐ ఆధారిత ఫోన్లతో ఫోన్ల విక్రయాలు ఊపందుకోవచ్చు. ఈ వార్తలతో ఇప్పటికే జూన్‌నుంచి చూస్తే కంపెనీ షేర్ విలువ స్టాక్‌మార్కెట్లో 13 శాతం పైకి ఎగసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ మరో 400 బిలియన్ డాలర్లు పెరిగింది.
– వాషింగ్టన్
Comments
Please login to add a commentAdd a comment