మైక్ పాంపియోతో విదేశాంగ మంత్రి జై శంకర్ (ఫైల్ ఫొటో)
వాషింగ్టన్/న్యూఢిల్లీ: ఇండో- పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, భద్రతకై భారత్- అమెరికా కలిసి పనిచేస్తాయని ఇరు దేశాల విదేశాంగ మంత్రులు పునరుద్ఘాటించారు. ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతాయని స్పష్టం చేశారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్‌తో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఫోన్‌లో సంభాషించారు. ఇందులో భాగంగా మహమ్మారి కోవిడ్-19 కట్టడికై తీసుకోవాల్సిన చర్యలు, అంతర్జాతీయ సమాజంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు(ప్రపంచంపై కరోనా ప్రభావం, అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల బాంబు దాడులు), ద్వైపాక్షిక, బహుళ పాక్షిక సంబంధాలు తదితర అంశాల గురించి చర్చించారు.(ఒక్క రోజే 2 వేలకు పైగా మరణాలు)
ఈ క్రమంలో వచ్చే ఏడాది ఇరు వర్గాల మధ్య 2+2 చర్చలు జరిపే అవకాశాలను పరిశీలించారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కేల్ బ్రౌన్ గురువారం ఓ ప్రకటనలో చర్చలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కాగా 2018 సెప్టెంబరులో న్యూఢిల్లీలో ఇరు దేశాల మధ్య 2+2 చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఇక భారత్- చైనా సరిహద్దుల్లో డ్రాగన్ కవ్వింపు చర్యలు, ఆసియా- పసిఫిక్ ప్రాంతంపై ఆధిపత్యం చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న వైఖరి, అమెరికా సహా ఇతర ప్రపంచ దేశాలపై కరోనా ప్రభావం తదితర అంశాల్లో చైనాపై అగ్రరాజ్యం గుర్రుగా ఉన్న నేపథ్యంలో వీరిరువురి చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. (భారత్- అమెరికాల బంధం మరింత బలపడాలి)
కాగా సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరిస్తూ, ఇండో- పసిఫిక్ ప్రాదేశిక జలాల విషయంలో చట్టవ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న చైనాకు అడ్డుకట్ట వేసేందుకు భారత్- అమెరికా మధ్య బంధం మరింత బలపడాలని అగ్రరాజ్య చట్టసభ ప్రతినిధులు అభిప్రాయపడిన విషయం తెలిసిందే. సార్వభౌమత్వం, సమగ్రతలను కాపాడుకునే క్రమంలో అమెరికా భారత్‌కు అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కాగా దక్షిణ చైనా సముద్ర పరిసరాల్లో ఉన్న ఆయిల్, గ్యాస్ నిల్వలపై కన్నేసిన చైనా ఇతర దేశాలతో చైనా గొడవపడుతోందని అమెరికా గతంలో ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు సదరు ప్రాదేశిక జలాల్లోని చమురు నిల్వలపై బ్రూనై, ఫిలిప్పీన్స్, మలేసియా, తైవాన్, వియత్నాం దేశాలు అభ్యంతరం వ్యక్తం చేయడం సహా.. ఈ సహజ నిల్వలపై హక్కు ఉందని వాదిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment