వాషింగ్టన్: చైనాతో విభేదాలు తారస్థాయికి చేరుకున్న వేళ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యంతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నమ్మకం చూరగొన్న భారత్‌కు చైనా నుంచి తరలిపోతున్న అంతర్జాతీయ స్థాయి కంపెనీలను ఆకర్షించగల సత్తా ఉందని పేర్కొన్నారు. అదే విధంగా వాణిజ్య అవసరాల కోసం భారత్ డ్రాగన్ కంపెనీలపై ఆధారపడటం తగ్గించుకోవాలని.. అప్పుడే చైనీస్ కమ్యూనిస్టు పార్టీ సృష్టిస్తున్న అవాంతరాలను సులభంగా అధిగమించవచ్చని అభిప్రాయపడ్డారు. (అగ్రదేశాల దౌత్య యుద్ధం)
ఈ మేరకు బుధవారం జరిగిన యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూఎస్‌ఐబీసీ)- ‘‘ఇండియా ఐడియాస్ సమ్మిట్’’లో వర్చువల్ సమావేశంలో పాంపియో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా- భారత్ కలిసి పనిచేస్తే ఎంతో బాగుంటుందని.. అయితే అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే పెట్టుబడులు పెట్టేందుకు భారత్ మరింత సానుకూల వాతావరణం కల్పించాల్సి ఉంటుందన్నారు.(అమెరికా కంపెనీలకు ప్రధాని మోదీ పిలుపు)
అదే విధంగా తాము కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాబోమని.. తమకు ఉన్న అతికొద్ది నమ్మకమైన, ఒకే ఆలోచనా విధానం కలిగిన దేశాల్లో భారత్ కూడా ఒకటి అంటూ ప్రశంసలు కురిపించారు. భారత్‌తో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు సుముఖంగా ఉన్నామని.. జీ-7 సదస్సుకు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించిన విషయాన్ని ఈ సందర్భంగా పాంపియో గుర్తు చేశారు.
ఇక చట్టాలకు లోబడి పనిచేసే సంస్థలు, పారదర్శకతకు అమెరికా పెద్ద పీట వేస్తుందన్న ఆయన.. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా టిక్‌టాక్ సహా 59 చైనీస్ యాప్‌లను భారత్ నిషేధం విధించిన విషయాన్ని ప్రస్తావించారు. చైనాలోని వుహాన్ నగరంలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ కల్లోలం కారణంగా ఆర్థిక వ్యవస్థలు, ప్రైవేటు రంగం కుదేలైన విషయాన్ని గుర్తు పెట్టుకుని ప్రపంచ దేశాలు ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. కాగా భారత్‌లోని ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, రక్షణ, ఇంధన, వ్యవసాయం, బీమా రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలంటూ అమెరికా కంపెనీలకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఆహ్వానం పలికిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment