
దుబాయ్: ఇజ్రాయెల్ సైన్యం, పాలస్తీనా హమాస్ పాలకుల మధ్య నాలుగో యుద్ధం మొదలయ్యింది. ఇరు వర్గాలు భీకరస్థాయిలో తలపడుతున్నాయి. అత్యాధునిక ఆయుధ శక్తి కలిగిన ఇజ్రాయెల్ సైన్యానికి హమాస్ మిలటరీ ధీటుగా బదులిస్తోంది. వైమానిక దాడులకు జవాబుగా రాకెట్లను ప్రయోగిస్తోంది. 10 రోజుల క్రితం ఇజ్రాయెల్, హమాస్ నడుమ ఘర్షణ ప్రారంభమయ్యింది. హమాస్ ఇప్పటిదాకా ఇజ్రాయెల్‌పై 4,000కు పైగా రాకెట్లను ప్రయోగించింది. వీటిలో చాలా రాకెట్లను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ నిర్వీర్యం చేసింది. అయితే, యూదు దేశంతో పోలిస్తే బలహీనం అని అంతర్జాతీయ సమాజం భావిస్తున్న హమాస్ ఆయుధ బలం ఇప్పుడు భారీగా పెరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సరైన కచ్చితత్వంతో హమాస్ రాకెట్లు ప్రయోగించడం గమనార్హం. కొన్ని రాకెట్లు తీరప్రాంత నగరమైన టెల్ అవీవ్ వరకు చేరుకున్నాయి. హమాస్ డ్రోన్ దాడులు చేసింది. సముద్ర గర్భంలో జలాంతర్గామి(సబ్‌మెరైన్) ద్వారా ఇజ్రాయెల్‌ను దెబ్బకొట్టేందుకు ప్రయత్నించింది.
ఆంక్షలను ధిక్కరించి..
దశాబ్దాలుగా యుద్ధాల్లో మునిగితేలి, అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న హమాస్ సొంతంగానే ఆయుధ సంపత్తిని అభివృద్ధి చేసుకుందని పరిశీల కులు చెబుతున్నారు. అందరూ ఊహిస్తున్న దాని కంటే హమాస్ బాంబింగ్ వ్యవస్థ చాలా పెద్దది, కచ్చితమైనదని గాజా సిటీలోని అల్–అజార్ యూనివర్సిటీకి చెందిన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఖైమర్ అబూసదా చెప్పారు. ఈజిప్టు సహా పలు దేశాలు కఠినమై న ఆంక్షలు, నిబంధనలు విధించినప్పటికీ హమాస్ తన ఆయుధాగారాన్ని బలోపేతం చేసుకోవడం ఆసక్తికరమైన అంశం.
ఇరాన్ అండదండలు
అంతర్జాతీయంగా ప్రస్తుతం మార్మోగుతున్న హమాస్ 1987లో ఏర్పాటయ్యింది. నాటు›బాంబులతో మొదలైన హమాస్ ప్రస్థానం ఇప్పుడు లాంగ్‌రేంజ్ రాకెట్ల దాకా చేరింది. ఒక రాజకీయ సంస్థగా ప్రారంభమైన హమాస్ తదనంతరం వ్యవస్థీకృత సైన్యాన్ని నిర్వహించే స్థాయికి చేరిందని శత్రుదేశం ఇజ్రాయెల్ అంగీకరిస్తోంది. ప్రారంభంలో హమాస్ ఇజ్రాయెల్ పౌరులపై కాల్పులు జరిపేది, వారిని అపహరించేది. 2000వ దశకంలో ఆత్మాహుతి దాడుల్లో వందలాది మంది ఇజ్రాయెల్ వాసులను బలితీసుకుంది. 2005లో గాజాపై పట్టు బిగించాక ఇరాన్, సిరియా నుంచి ఆధునిక ఆయుధాలు కూడగట్టుకోవడం మొదలుపెట్టింది. ఇరుగు పొరుగు ముస్లిం దేశాలు హమాస్‌కు అక్రమంగా ఆయుధాలను సరఫరా చేశాయి. ఇందుకోసం అండర్‌గ్రౌండ్ సొరంగాలను హమాస్ ఉపయోగించుకుంది.
ఆధునిక సాంకేతికతను, ఆయుధ తయారీ పరిజ్ఞానాన్ని హమాస్ సొంతం చేసుకుంది. ఆయు«ధ ఉత్పత్తి ప్రారంభించింది. 2012లో ఈజిప్టు అధ్యక్షుడిగా మోర్సీ ఎన్నిక కావడం హమాస్‌కు బాగా కలిసొచ్చింది. మోర్సీ హమాస్‌కు పూర్తిస్థాయిలో సహకరించారు. 2012లో మోర్సీ పదవీచ్యుతుడైన తర్వాత హమాస్‌ను ఇరాన్‌ను ఆదుకుంది. ఇరాన్ ఏటా హమాస్‌కు 100 మిలియన్ డాలర్ల మేర సాయం అందిస్తున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్ అంచనాల ప్రకారం.. హమాస్ వద్ద 7,000కు పైగా రాకెట్లు ఉన్నాయి. ఇజ్రాయెల్‌లో ఏమూలనైనా లక్ష్యంగా చేసుకోగల దూరశ్రేణి క్షిపణులు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే 300 యాంటీ ట్యాంక్, 100 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్‌సైల్స్‌ను సైతం సొంతం చేసుకుంది. అంతేకాకుండా 30 వేల మంది సుశిక్షితులైన సైనికులు, 400 మంది నేవీ కమెండోలున్నారు.
Comments
Please login to add a commentAdd a comment