భారత్ అంటే "911 కాల్".. మాల్దీవుల మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు | 'India Our 911 Call', Says Former Maldives Minister Amid Diplomatic Row - Sakshi
Sakshi News home page

భారత్ అంటే "911 కాల్".. మాల్దీవుల మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

Published Tue, Jan 9 2024 10:29 AM | Last Updated on Tue, Jan 9 2024 10:39 AM

India Our 911 Call Says Former Maldives Minister Amid Diplomatic Row - Sakshi

మాలే: మాల్దీవులు-భారత్ మధ్య కొనసాగుతున్న వివాదంపై ఆ దేశ మాజీ రక్షణ మంత్రి మారియా అహ్మద్ దీదీ స్పందించారు. ప్రధాని మోదీపై అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం మాల్దీవుల ప్రభుత్వానికే చిన్నచూపు అని ఆమె అన్నారు. రక్షణతో సహా వివిధ రంగాలలో సహాయం చేస్తూ భారతదేశం నమ్మకమైన మిత్రదేశంగా ఉందని చెప్పారు. భారత్‌తో మాల్దీవులకు ఉన్న చిరకాల బంధాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను ఆమె విమర్శించారు.

మాల్దీవుల మంత్రుల అవమానకరమైన వ్యాఖ్యలపై మారియా అహ్మద్ నిరాశను వ్యక్తం చేశారు. మాల్దీవుల పట్ల భారతదేశాన్ని "911 కాల్"(అమెరికాలో అత్యవసర సేవల నెంబర్)గా అభివర్ణించారు. ఎప్పుడూ కాల్ చేసినా మాల్దీవులను రక్షించడానికి సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు. ప్రధాని మోదీని అవమానించడం ప్రస్తుత ప్రభుత్వ చిన్న చూపు అని విమర్శించారు. 'మేము అధికారంలో ఉన్నప్పుడు అందరితో స్నేహంగా ఉన్నాం. భారతదేశంతో భద్రతా సమస్యలను పంచుకున్నాం. భారత్‌ కూడా ఎల్లప్పుడూ మాకు సహాయం చేస్తుంది. రక్షణ రంగంలో సామర్థ్యం పెంపొందించడం మాల్దీవులను స్వయం సమృద్ధిగా మార్చడానికి ప్రయత్నించాం' అని మరియా అహ్మద్ దీదీ అన్నారు.

ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యల అంశంపై మాల్దీవుల విదేశాంగ మంత్రిని పార్లమెంట్‌లో ప్రశ్నించాలని ఆ దేశ పార్లమెంట్ సభ్యుడు మికేల్ నసీమ్ పిలుపునిచ్చారు. అవమానకర వ్యాఖ్యలు చేసిన సభ్యులు జవాబుదారీతనంగా ఉండాలని కోరారు. భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ దేశ ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ి

ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. లక్షద్వీప్‌ను పర్యాటక ధామంగా మార్చాలంటూ ఆ సందర్భంగా ఆయన వీడియో, ఫొటోలు షేర్‌ చేశారు. అవి ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. పలువురు నెటిజన్లు లక్షద్వీప్‌ను మాల్దీవులతో పోల్చారు కూడా! దీనిపై మాల్దీవుల మంత్రి షియునా వ్యంగ్యంగా స్పందించారు. మోదీని జోకర్‌గా, తోలుబొమ్మగా పేర్కొంటూ ట్వీట్లు చేశారు. మంత్రులు మజీద్, మల్షా కూడా ఇవే రకమైన వ్యాఖ్యలు చేశారు.

మంత్రుల  వివాదాస్పద వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య వివాదాస్పద వాతావరణం ఏర్పాటైంది. భారత్‌ గురించి హైళనగా మాట్లాడటంపై ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బైకాట్ మాల్దీవులు నినాదాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆ తర్వాత ఇరుదేశాలు హైకమిషనర్లకు సమన్లు జారీ చేశాయి.

 ఇదీ చదవండిL: భారత హైకమిషనర్‌కు మాల్దీవులు సమన్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement