ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని 'ఇజ్రాయెల్ తోలుబొమ్మ'తో పోల్చుతూ మాల్దీవుల మంత్రి మరియం షియునా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ దేశ ప్రభుత్వం ఖండించింది. ఈ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. అభిప్రాయాలు వ్యక్తిగతమైనవని పేర్కొంది. ప్రభుత్వ హోదాలో ఉండి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇలాంటి ద్వేషపూరిత వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలకు ఎలాంటి ఆటంకం కలిగించదని స్పష్టం చేసింది.
లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా మోదీ ఫొటోలు విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలను ఉద్దేశిస్తూ మాల్దీవుల యూత్ ఎంపవర్‌మెంట్ డిప్యూటీ మంత్రి మరియం షియునా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీని ఇజ్రాయెల్ తోలుబొమ్మ అని పేర్కొంటూ ట్విట్టర్ వేదికగా పోస్టులు చేశారు. ఈ వ్యాఖ్యలపై భారత్ కూడా స్పందించింది. మంత్రి మరియం షియునా వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రి మరియం షియునా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు రావడంతో ట్విట్టర్(ఎక్స్) నుంచి వాటిని తొలగించారు. మాల్దీవులను బైకాట్ చేయాలంటూ పలువురు విమర్శించారు.
ఖండించిన మాజీ అధ్యక్షుడు..
ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రి మరియం షియునా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ కూడా తీవ్రంగా ఖండించారు. ఆమె ఉపయోగించిన భాష భయంకరమైనదని అన్నారు. మాల్దీవుల శ్రేయస్సు కోసం పనిచేయడంలో భారత్ మంచి మిత్రుడని అన్నారు.
"ప్రధాని మోదీపై మంత్రి మరియం షియునా భయంకరమైన వ్యాఖ్యలు చేశారు. మొహమ్మద్ ముయిజ్జూ ప్రభుత్వం ఈ వ్యాఖ్యలకు దూరంగా ఉండాలి. ఆ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని భారతదేశానికి స్పష్టమైన హామీ ఇవ్వాలి" అని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు నషీద్ అన్నారు.
ఇదీ చదవండి: ‘ఫొటో సెషన్‌కు సమయం ఉంది.. మణిపూర్ పరిస్థితి ఏంటి?’
Comments
Please login to add a commentAdd a comment