రష్యా అధినేత పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని మీడియా ప్రాజెక్ట్ సంస్థ ‘ఇన్వెస్టిగేషన్ ఆన్ వ్లాదిమిర్ పుతిన్ హెల్త్’ పేరిట విడుదల చేసిన ఒక కథనంలో అనుమానం వ్యక్తం చేసింది. రష్యా ప్రజల నుంచి ఆయన తన అనారోగ్యాన్ని దాచిపెడుతున్నారని, ఇందుకోసమే ఉక్రెయిన్‌పై దాడికి దిగారని గతంలో వచ్చిన ఆరోపణలకు తాజా కథనం బలం చేకూరుస్తోంది. ఈ మీడియా ప్రాజెక్ట్ (మీడియా ప్రొకెట్ అంటారు) సంస్థను రష్యాలో నిషేధించారు. దీంతో సంస్థ విదేశాల నుంచి కార్యకలాపాలు నడుపుతోంది.
పుతిన్ స్టెరాయిడ్ వాడకంలో ఉన్నారని, అందుకే ఆయన మెడ, ముఖం వాచినట్లున్నాయని కథనంలో పేర్కొంది. పుతిన్‌తో ఎప్పుడూ ఉండే కొందరు డాక్టర్ల గురించి కథనంలో ప్రస్తావించారు. వీరిలో ఒకరు థైరాయిడ్ క్యాన్సర్ స్పెషలిస్టు కాగా మరొకరు న్యూరో సర్జన్. పుతిన్ 2020 జూలైలో నేషనల్ మెడికల్ రిసెర్చ్ సెంటర్ ఫర్ ఎండోక్రైనాలజీ అధిపతి ఇవాన్ దెదోవ్‌ను కలిసారని కథనం తెలిపింది. పుతిన్ పెద్ద కూతురు ఇక్కడే పనిచేస్తారు.
ఈ సమావేశంలో థైరాయిడ్ క్యాన్సర్, లక్షణాలు, దానికి కనిపెట్టిన టైరోజిన్ అనే ఔషధం తదితర వివరాలను పుతిన్‌కు ఇవాన్ వివరించారని కథనం పేర్కొంది. కొత్త ఔషధం వల్ల రికవరీ ఎంత వరకు ఉండొచ్చని పుతిన్ ప్రశ్నించారని తెలిపింది. అప్పుడే పుతిన్ ఆరోగ్యంపై చర్చలు మొదలయ్యాయని తెలిపింది. కరోనా సమయంలో పుతిన్ చాలా రోజులపాటు ఐసోలేషన్‌లో ఉన్నారని, ఆ సమయంలో థైరాయిడ్ క్యాన్సర్ స్పెషలిస్టు ఆయనతో ఎప్పుడూ ఉండేవారని పేర్కొంది. తర్వాత రోజుల్లో ఆయన జనాలతో చాలా దూరం నుంచి మాట్లాడేవారని గుర్తు చేసింది.
2016 నుంచే?
పుతిన్ అనారోగ్య సమస్యలు 2016–17 నుంచే సీరియస్‌గా మారాయని కథనం పేర్కొంది. ఆ సమయంలో ఆయనకు డిమిట్రీ వెర్బోవోయ్ అనే డాక్టరు చికిత్స చేశారు. సోచీలోని ఒక రిసార్టులో పుతిన్ ఎక్కువగా గడుపుతుంటారు. ఇక్కడ ఆయన చుట్టూ ఎప్పుడూ కనీసం 5– 17మంది డాక్టర్లుండేవారని తెలిపింది. అనారోగ్య కారణాలతో పుతిన్ సడెన్‌గా మాయమవడం ఐదుసార్లు జరిగిందని గుర్తు చేసింది. ఆయనకు చికిత్సనందించినందుకు కృతజ్ఞతగానే ఓలెగ్ మిస్కిన్ అనే వైద్యుడికి పుతిన్ డాక్టర్ ఆఫ్ రష్యా అవార్డిచ్చారని తెలిపింది.
థైరాయిడ్ ప్రాంతంలో వాపు, మాట బొంగురుగా రావడం, మింగడంలో ఇబ్బందులు, గొంతు నొప్పి, పొడిదగ్గు తదితరాలుంటే థైరాయిడ్ క్యాన్సర్‌గా అనుమానిస్తారు. పుతిన్‌కు ఈ సమస్యలున్నాయని, అందుకే డాక్టర్ అలెక్సీ షెగ్లోవ్ అనే స్పెషలిస్టు పుతిన్‌తో 282 రోజుల పాటు కలిసిఉన్నారని కథనం తెలిపింది. ఆయనతో పాటు ఇగోర్ ఇసకోవ్ అనే స్పెషలిస్టు 152 రోజులు, క్యాన్సర్ సర్జన్ సెలివనోవ్ 166 రోజుల పాటు పుతిన్‌తో గడిపారని తెలిపింది. అయితే వీరు ఏ సమయంలో పుతిన్‌తో కలిసిఉన్న విషయం కథనంలో వెల్లడించలేదు.
ఎంతవరకు నిజం?
గతంలో కూడా పుతిన్ ఆరోగ్యంపై పలు కథనాలు వచ్చాయి. వచ్చే అక్టోబర్‌కు ఆయనకు 70 సంవత్సరాలు వస్తాయి. కేవలం వయసు కారణంగా వచ్చే సమస్యలు తప్ప ఆయనకు మరీ తీవ్రమైన అనారోగ్యాలు లేవని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాశ్చాత్య ప్రభుత్వాలు కావాలని ఇలాంటి కథనాలు వ్యాప్తిచేస్తుంటాయని రష్యా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయనకు మానసిక సమస్యలున్నాయంటూ జపాన్‌కు చెందిన రిస్క్ మేనేజ్‌మెంట్ టెక్నాలజీస్ సంస్థ ఒక కథనం వెలిబుచ్చింది. ప్రస్తుతం ఆయనకు క్యాన్సర్ ముదిరిపోయిందన్న కథనం కూడా ఇలాంటి కల్పిత కథేనని కొందరు నిపుణుల భావన. రష్యా లాంటి దేశంలో అధికారికంగా ప్రకటించేవరకు ఏ సంగతి తెలియదని వీరు గుర్తు చేస్తున్నారు.
ఐదుసార్లు గాయబ్!
గతంలో అనారోగ్య కారణాలతో పుతిన్ అకస్మాత్తుగా కొన్ని రోజులపాటు కనిపించకుండా పోయిన ఘటనలివే..
1. 2012 నవంబర్: వ్యాపార యాత్రలు, దూర ప్రయాణాలను పుతిన్ రద్దు చేసుకున్నారు. ఆయన యథావిధిగా విధులు నిర్వహిస్తున్నట్లు చూపడానికి పాత వీడియోలను కొన్నాళ్లు క్రెమ్లిన్ ప్రసారం చేసేది.
2. 2015 మార్చి: ప్రజలకు దూరంగా కొన్నాళ్లు కనిపించలేదు. ఆయన పాల్గొనాల్సిన సమావేశాలు రద్దయినా గత వీడియోలను చూపి సదరు సమావేశాలు జరిగినట్లు మేనేజ్ చేశారు.
3. 2017 ఆగస్టు: సోచీ రిసార్టుకు వెళ్లిన పుతిన్ వారం పాటు కనిపించలేదు.
4. 2018 ఫిబ్రవరి: ఎన్నికల ప్రచారం మధ్యలో అకస్మాత్తుగా అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొన్నారు. ఆయనకు జలుబు చేసినందున విశ్రాంతికి వెళ్లారని అధికారులు చెప్పారు.
5. 2021 సెప్టెంబర్: సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. అన్ని కార్యక్రమాలకు వీడియో ద్వారా హాజరయ్యారు.
– నేషనల్ డెస్క్, సాక్షి.
Comments
Please login to add a commentAdd a comment