గాజా కాల్పుల విరమణ ఒప్పంద చర్చలపై అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ చేసిన వ్యాఖ్యపై హమాస్ విమర్శలు చేసింది. ఆయన వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేవని పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నవీకరించిన ఒప్పంద ప్రతిపాదనను ఆమోదించారని ఆంటోని బ్లింకెన్ చేసిన వాఖ్యలపై హమాస్ సీనియర్ అధికారి ఒసామా హమ్దాన్ స్పందించారు.
‘నవీకరించిన గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆ ఒప్పందం మాకు సమర్పించింది (లేదా) అంగీకరించినది కాదు. మాకు కొత్త గాజా కాల్పుల విరమణ చర్చలు అవసరం లేదు. అమలు యంత్రాంగాన్ని మేము అంగీకరించము’అని అన్నారు.
సోమవారం బ్లింకెన్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో సమావేశమయ్యారు. నెతన్యాహుతో సమావేశం అనంతరం.. ‘ఇది చాలా కీలమైన దశ.. ఒప్పందానికి ఆఖరి అత్యుత్తమ అవకాశం. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి నెతన్యాహు మద్దతు తెలిపారు. హమాస్ కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించాలి. కొత్త గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లు నెతన్యాహు చెప్పారు’అని అన్నారు.
అమెరికా, ఈజిప్టు, ఖతార్‌ల మధ్యవర్తిత్వంతో గురువారం ప్రారంభమైన గాజా కాల్పుల విరమణ చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే శుక్రవారం ముగిసిన విషయం తెలిసిందే. ఈ వారంలో మళ్లీ చర్చలు ప్రారంభం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment