ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టిందని ఆనందపడే అమ్మానాన్నలు.. అంతలోనే ఆమె ఆలనాపాలనా కంటే కూడా తన భద్రత గురించిన భయాలతోనే ఎక్కువగా ఆందోళన చెందుతారు. పురుషాధిక్య సమాజంలో ఆమెను కంటికి రెప్పలా కాపాడుకున్నా ఎటువైపు నుంచి ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో తెలియదు. అందుకే పెళ్లీడు వచ్చిందంటే చాలు... అప్పు చేసైనా సరే ఆమెను ఓ ‘అయ్య’ చేతిలో పెట్టి అత్తవారింటికి సాగనంపాలని ఆరాటపడతారు. ఈ క్రమంలో, బిడ్డను బాగా చదివిస్తే అంతకంటే ఎక్కువ విద్యావంతుడిని అల్లుడిగా తీసుకురావాల్సి వస్తుందనే భావనతో మధ్యలోనే చదువు మాన్పించే సగటు మధ్యతరగతి తల్లిదండ్రులు నేటికీ అనేక మంది ఉన్నారు.
అలాంటి వారు కూతురి చదువు కోసం చేయాల్సిన ఖర్చును ఆమె వివాహం కోసం, ముఖ్యంగా వరకట్నం కోసమే పొదుపు చేస్తారు. అంతచేసినా, ఎంత పెద్దమొత్తంలో కట్నకానుకలు ముట్టజెప్పినా నవ వధువులు అత్తారింట్లో సంతోషంగా ఉంటారనే గ్యారెంటీ లేదు. అదనపు కట్నం కోసం వేధిస్తూ కొత్తకోడళ్ల ఉసురు తీసిన అత్తమామలు, భర్తల గురించి ప్రతిరోజూ ఏదోఒక వార్త మన కంటపడుతూనే ఉంటుంది. కాబట్టి, ఆడబిడ్డలను చదివించుకుంటే అత్తారింట్లో సమస్యలు ఎదురైనా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ తమ కాళ్లమీద తాము నిలబడగలిగే అవకాశం ఉంటుంది.
ఈ నేపథ్యంలో వరకట్నం అనే దురాచారానికి స్వస్తి పలకాలంటూ, ఐక్యరాజ్యసమితి పాకిస్తాన్ మహిళా విభాగంతో కలిసి ఫ్యాషన్ డిజైనర్ అలీ జీషన్ చేపట్టిన సోషల్ మీడియాలో చేపట్టిన ‘స్టాప్ డౌరీ’ ప్రచారం నెటిజన్లను ఆలోచింపజేస్తోంది. నుమాయిష్- బ్రైడల్ కోచర్ వీక్ 2021లో భాగంగా అలీ వివాహ దుస్తులను డిజైన్ చేశారు. ఇందుకు సంబంధించి.. ‘‘అమ్మాయిల చదువు కంటే కూడా వారి పెళ్లి సమయంలో వరుడికి ఇవ్వాల్సిన కట్నాన్నే ప్రథమ ప్రాధాన్యంగా భావిస్తారు. ఆ అదనపు భారాన్ని తగ్గించే సమయం ఆసన్నం అయ్యింది’’ అని ఆయన షేర్ చేసిన వీడియో నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. అయితే, కొంతమంది మాత్రం అలీ రూపొందించే దుస్తుల ధర విషయాన్ని ప్రస్తావిస్తూ నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు.
‘‘తల్లిదండ్రులపై పడే భారం గురించి ఇంతలా ఆలోచిస్తున్న అలీ డిజైన్ చేసే ఒక్కో డ్రెస్ ధర వేలల్లో, కొన్నిసార్లు లక్షల్లో కూడా ఉంటుంది. కనీసం 5 లక్షలు పెడితేనే వధూవరులకు ఇష్టమైన దుస్తులు కొనగలుగుతారు. చాలా కుటుంబాల్లో అమ్మాయికి ఇంతకంటే తక్కువే కట్నం ఇస్తారు. అలాంటది, అలీ వరకట్నం గురించి మాట్లాడితే నవ్వొస్తోంది. ఎంతటి నయవంచకుడు తను. ఒక దురాచారం గురించి చెబుతూనే తన బిజినెస్‌ను బాగా ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఖరీదైన దుస్తులు వేసి వేయించిన ఈ నాటకం అంతగా పండలేదు’’ అని విమర్శిస్తున్నారు.
వీడియోలో ఏముందంటే..
ఆడపిల్ల తల్లిదండ్రులు తొలుత టైర్లతో కూడిన బల్లపరుపు బండిని తీసుకువస్తారు. అనంతం కొత్త కాపురానికి కావాల్సిన వస్తువులన్నీ దానిపై వరుసగా పేరుస్తారు. ఇద్దరూ చెరోవైపు నిల్చుని, బండిని పైకెత్తి, పెళ్లి దుస్తుల్లో ఉన్న కుమార్తెను పిలిచి ఆమెకు దానిని అప్పగిస్తారు. పుట్టింటి వారు ఇచ్చిన కానుకలతో పాటు వరుడు కూడా ఆ బండిపై కూర్చోగా వధువు కన్నీళ్లు పెడుతూనే దానిని లాగే ప్రయత్నం చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment