ఏఐకి చెప్తే..వెబ్‌సైట్‌ రెడీ!  | worlds first artificial intelligence software engineer invented Devin | Sakshi
Sakshi News home page

ఏఐకి చెప్తే..వెబ్‌సైట్‌ రెడీ! 

Published Thu, Mar 14 2024 6:05 AM | Last Updated on Thu, Mar 14 2024 12:11 PM

worlds first artificial intelligence software engineer invented Devin - Sakshi

ప్రపంచంలోనే మొట్టమొదటికృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌‘డెవిన్‌’ ఆవిష్కరణ 

రూపొందించిన అమెరికా స్టార్టప్‌కంపెనీ కాగ్నిషన్‌ 

వెబ్‌సైట్లు, సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌లను పూర్తిస్థాయిలో తయారు చేయగలదు 

సాఫ్ట్‌వేర్‌ కోడ్‌ రాయడంతోపాటుటెస్టింగ్, డీబగ్గింగ్, డిప్లాయ్‌ కూడా చేయగలదు 

ఇప్పటికే వివిధ బెంచ్‌మార్క్‌టెస్టులను ‘డెవిన్‌’ పాస్‌ అయిందని తెలిపిన కాగ్నిషన్‌  

కృత్రిమ మేధ (ఏఐ) ప్రోగ్రామ్‌లకు చిన్న సూచన చేస్తే.. మనకు కావాల్సినట్టుగా ఫొటోలను తయారు చేసిపెడుతున్నాయి.. కావాల్సినట్టుగా వీడియోలనూ రూపొందిస్తున్నాయి.. అడిగిన డేటాను నెట్‌లో సెర్చ్‌ చేసిపెడుతున్నాయి.. అనుమానాలు ఉంటే తీరుస్తున్నాయి.. ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఇప్పుడు ఏకంగా వెబ్‌సైట్లను, సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌లను కూడా పూర్తిస్థాయిలో తయారు చేసిపెట్టగల ‘ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌’ వచ్చేసింది.  

‘డెవిన్‌’ పేరుతో.. 
టెక్నాలజీ ప్రపంచంలో ఇటీవల వచ్చిన చాట్‌ జీపీటీ ఏఐ ప్రోగ్రామ్‌ ఎంతో కలకలం రేపింది. అది విద్యార్థులకు కావాల్సిన ఆర్టికల్స్‌ రాసిపెట్టడం నుంచి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు అవసరమైన కోడ్‌లనూ సిద్ధం చేసి ఇవ్వడం సంచలనం సృష్టించింది. కానీ ఇప్పుడు అమెరికాకు చెందిన కాగ్నిషన్‌ అనే స్టార్టప్‌ కంపెనీ ‘ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌’ను సృష్టించింది. దానికి ‘డెవిన్‌’ అని పేరు పెట్టింది.

వెబ్‌సైట్లను, సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌లను కూడా పూర్తిస్థాయిలో తయారు చేసి ఇవ్వగలదని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ఇంటర్వ్యూలను, వివిధ బెంచ్‌మార్క్‌ టెస్టులను ఇది విజయవంతంగా పాస్‌ అయిందని తెలిపింది. ఇలాంటి పూర్తిస్థాయి ఏఐ ప్రోగ్రామ్‌ ప్రపంచంలోనే ఇదే మొదటిది కావడం గమనార్హం. 

కోడ్‌ నుంచి డిప్లాయ్‌ దాకా.. 
సాధారణంగా ఒక సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్, వెబ్‌సైట్‌ను రూపొందించడంలో చాలా ప్రక్రియలు ఉంటాయి. కోడ్‌ రాయడం దగ్గరి నుంచి టెస్టింగ్, డీబగ్గింగ్‌ చేయడం, చివరికి దాన్ని డిప్లాయ్‌ చేయడం దాకా ఎన్నో క్లిష్టమైన పనులు చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న చాట్‌ జీపీటీ వంటి ఏఐ ప్రోగ్రామ్‌లు.. కొంతవరకు సాఫ్ట్‌వేర్‌ కోడ్‌లను రాసిపెట్టగలుగుతున్నాయి కూడా.

అయితే తాము అభివృద్ధి చేసిన ‘డెవిన్‌’.. సాఫ్ట్‌వేర్‌ కోడ్‌ రాయడంతోపాటు.. టెస్టింగ్, డీబగ్గింగ్, డిప్లాయ్‌ కూడా చేయగలదని ‘కాగ్నిషన్‌’ కంపెనీ ప్రకటించింది. ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ చేయగల స్థాయిలో పూర్తిస్థాయిలో పనిచేసే వెబ్‌సైట్‌ను రెడీ చేసి పెడుతుందని వివరించింది. అది కూడా జస్ట్‌ ఒక చిన్న కమాండ్‌ ఇస్తే సరిపోతుందని తెలిపింది.  ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను నేర్చుకోగలదని వివరించింది. 

కేవలం కంప్యూటర్‌లో సృష్టించడం కాకుండా.. వాస్తవంగా సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్స్‌ ఎంత సమర్థంగా పనిచేస్తున్నాయనేది తేల్చే ‘ఎస్‌డబ్ల్యూఈ–బెంచ్‌మార్క్‌’లో డెవిన్‌ మంచి పనితీరు చూపడం గమనార్హం. ఈ బెంచ్‌మార్క్‌లో.. చాట్‌ జీపీటీ–3.5 ప్రోగ్రామ్‌ 0.52%, చాట్‌ జీపీటీ–4 ప్రోగ్రామ్‌ 1.74%, క్లాడ్‌ 4.8% సాఫ్ట్‌వేర్‌ సమస్యలను పరిష్కరించగలిగితే.. డెవిన్‌ ఏకంగా 13.86% పరిష్కరించగలిగింది. 

తప్పులను గుర్తించి సరిదిద్దుకునేలా.. 
‘డెవిన్‌’ ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఎలా పనిచేస్తుందన్న దానిపై కాగ్నిషన్‌ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ స్కాట్‌ వూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఈ ఏఐ ప్రోగ్రామ్‌కు కొన్నేళ్లుగా శిక్షణ ఇస్తున్నామని.. తాను చేసిన తప్పులను గుర్తించి సరిదిద్దుకునే సామర్థ్యం కూడా ఉందని ఆయన వెల్లడించారు. ‘ఏఐ’ ప్రోగ్రామ్‌ల రాకతో భారీగా ఉద్యోగాలు పోతాయన్న ఆందోళనలపైనా ఆయన స్పందించారు.

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు ఉపయుక్తంగా ఉండేందుకు ‘డెవిన్‌’ను రూపొందించామని.. దీనినే పూర్తిస్థాయిలో ‘ఏఐ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌’గా వినియోగించాలన్నది తమ ఉద్దేశం కాదని పేర్కొన్నారు. వెబ్‌సైట్లతోపాటు మనకు కావాల్సిన విధంగా వీడియో దృశ్యాలనూ ‘డెవిన్‌’ రూపొందించగలదని వెల్లడించారు.  – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement