
జనగామ: తెలంగాణ ఉద్యమంతో పాటు జనగామ జిల్లా ఏర్పాటు సమయంలో తన నియోజకవర్గంలోని ఐదు మండలాలను త్యాగం చేసిన నాకే సీటు ఇస్తారని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుగుణాకర్ రాజును ఆదివారం ఆయన స్వగృహంలో ఎమ్మెల్యే మర్యాద పూర్వకంగా కలిశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో మాదిగ సామాజికవర్గంలోని తనబిడ్డలకు కాకుండా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇతరులకు టికెట్ ఇవ్వరని, వచ్చే సాధారణ ఎన్నికల్లో తనకు సీటు కాయమనే నమ్మకం పూర్తిగా ఉందని, లేని పక్షంలో తాను సూచించిన వారికే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని భావించడం జరుగుతుందన్నారు. వైద్య సేవల పరంగా అద్భుతంగా రాణిస్తున్న డాక్టర్ సుగుణాకర్‌రాజు పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చి, ప్రజా సేవలో పునరంకితం కావాలన్నారు. రాజకీయాల్లో తనవంతు సహకారం ఉంటుందని సుగుణాకర్‌రాజుకు అభయం ఇచ్చారు.