అభయం..
మహిళలకు అండగా నిలుస్తున్న భరోసా కేంద్రం
● లైంగిక వేధింపులు, దాడులకు గురైన వారికి చట్టపరంగా రక్షణ
● న్యాయ సలహాలు, వైద్యం,
ఉపాధి, వసతి కల్పనకు కృషి
● 2022లో జిల్లాలో ఏర్పాటు..
ఇప్పటి వరకు 195 కేసులు నమోదు
● 138 మంది బాధితులకు
రూ.35 లక్షల పరిహారం అందజేత
గద్వాల క్రైం: జిల్లాలోని భరోసా కేంద్రం ఎంతో మంది అండగా నిలుస్తోంది. ఈ కేంద్రంలో 2022లో సేవలు మొదలైనప్పటి నుంచి పోక్సో, లైంగిక దాడి తదితరవి 195 కేసులు నమోదయ్యాయి. ఈక్రమంలో సదరు బాధితుల్లో మనోధైర్యం నింపుతూ.. బాధితులు కోరిన ప్రకారం వారికి న్యాయ సేవలు అందించారు. భరోసా కేంద్రం ద్వారా రూ.35లక్షలు పరిహారంగా అందజేసి ఆర్థికంగా అండగా నిలుస్తోంది. మహిళలు, పిల్లలకు చట్టపరంగా రక్షణ కల్పించడం కోసం ఇంటిగ్రేటెడ్ సపోర్టు సెంటర్ ఫర్ ఉమెన్, చిల్డ్రన్(భరోసా) కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బాధితులకు సత్వర స్వాంతన, న్యాయ సేవలు అందించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది.
195 కేసులు నమోదు..
గద్వాల, గట్టు, ధరూర్, మానవపాడు, అలంపూర్, అయిజ, కేటీదొడ్డి, మల్దకల్, ఇటిక్యాల, శాంతినగర్, రాజోళి తదితర మండలాల్లో ఇప్పటి వరకు 195 కేసులు నమోదు చేశారు. లైంగిక వేధింపులకు గురైన 138 బాధితులకు ఆర్థికమైన నిధులను కేటాయించి రూ.35 లక్షల పరిహారం అందజేశారు. తక్షణ సహాయం కింద రూ.5వేల నుంచి రూ.10 వేలు అందించారు. సమస్యల సుడిగుండాల నుంచి విముక్తి కల్పించేందుకు ఒకే గొడుగు కింద న్యాయ సలహాల, వైద్యం, ఉపాధి, వసతితో పాటు కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలను సైతం సేకరించి దోషులకు చట్ట పరమైన శిక్ష విధించేలా జిల్లా పోలీసుశాఖ, భరోసా విభాగం కృషి చేస్తుంది.
అండగా నిలుస్తూ..
వయస్సు, వర్గం, కులం, విద్యార్హత, వైవాహిక స్థితి, జాతి సంస్కృతితో సంబంధం లేకుండా కుటుంబ, కమ్యూనిటీ, పబ్లిక్ ప్రదేశాలలో లైగింక, బావోద్వేగ, మానసిక, ఆర్థిక వేధింపులను ఎదుర్కొంటున్న సీ్త్రలకు భరోసా సెంటర్ ద్వారా ప్రత్యేక న్యాయ నిపుణులు, వైద్యులు, మానసిక నిపుణులు ద్వారా కౌన్సెలింగ్ అందించి వారి అభ్యున్నతికి చేయూతనిస్తున్నారు. బాధితులలో ఆత్మస్థైర్యం నింపుతున్నారు. క్షేత్ర స్థాయిలో వివరాలు తెలుసుకొని విద్య, స్వయం ఉపాధి రంగాల్లో నిలదొక్కుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. స్వయంగా బాధిత కుటుంబాల ఇళ్లను సందర్శించి వారికి ఆర్థిక పరంగా సాయం అందజేస్తున్నారు. ఆర్థికంగా నిలబడేలా పలు ఉపాధి రంగాల్లో శిక్షణ అందించి ఆర్థిక అవకాశాలు కల్పిస్తున్నారు.
ధైర్యంగా ఫిర్యాదు చేయాలి
మహిళలు, విద్యార్థినులు, చిన్నారులపై ఇటీవల వేధింపులు, దాడులు అధికమయ్యాయి. ఇలాంటి వాటిపై బాధితులు, వారి సంబంధీకులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి. తక్షణం పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకుంటాం. భరోసా సెంటర్ ద్వారా బాధిత మహిళలకు నూతన అంశాలు, ఉపాధి మార్గాలను వివరిస్తూ.. ఆర్థిక పరమైన చేయూత అందిస్తున్నాం. మహిళలు, విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తే ఎంతటి వారినైనా సరే ఉపేక్షించేదిలేదు.
– శ్రీనివాసరావు,
ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment