వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
ధరూరు: ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రధానంగా వ్యక్తిగత పరిశుభ్రతపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ, న్యాయమూర్తి గంటా కవితా దేవి అన్నారు. శనివారం మండలంలోని నెట్టెంపాడు ప్రాథమిక పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. పిల్లలకు ప్రధానంగా నిత్యం స్నానం చేసే అలవాటుతో పాటు శుభ్రంగా ఉతికిన బట్టలు వేసుకునేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని, అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ద ఉంచి, తోటి పిల్లలకు మార్గదర్శకంగా ఉండేలా పిల్లలను సిద్ధం చేసి సమయానకూలంగా పాఠశాలకు పంపాలన్నారు. చిన్న నాటి నుంచే క్రమశిక్షణ అలవర్చితే మున్ముందు ఎలాంటి ఇబ్బంది ఉండదని, బాగా చదివి ప్రయోజకులు కావాలని, ఒక లక్ష్యాన్ని ఎంచుకుని చదవాలని సూచించారు. అలాగే బాల్య వివాహాలు, బాల కార్మికులు తదితర అంశాలపై వివరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఆది మల్లారెడ్డి, రాజేందర్, లక్ష్మణస్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment