పిఠాపురం: తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట తారస్థాయికి చేరింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ శుక్రవారం టీడీపీ నుంచి కొందరు నేతలను బహిష్కరించగా వారు ఆయన తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. గొల్లప్రోలులో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో టీడీపీ మాజీ మండల అధ్యక్షుడు బవిరిశెట్టి రాంబాబు మాట్లాడుతూ 45 ఏళ్లుగా రామ లక్ష్మణులుగా కలిసిమెలిసి పోతున్న అన్నదమ్ములను (తునిలో యనమల సోదరులను) కుటిల రాజకీయాలతో విడదీసిన ఘనుడవు అంటూ వర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక నియంతలా పరిపాలించడమే కాకుండా పదవి పోయాక కూడా కింది స్థాయి నాయకులను అణగదొక్కే ప్రయత్నాలు మానలేదని అన్నారు. ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్మన్లను కీలు బొమ్మలుగా చేసిన నీచుడని వర్మపై నిప్పులు చెరిగారు.
కాకినాడకు చెందిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు మాదేపల్లి శ్రీను మాట్లాడుతూ కాపు సామాజిక వర్గ నేతలను ఎదగనీయకుండా చేశారన్నారు. డబ్బులిచ్చుకుని తనకు సొసైటీ పదవి ఇచ్చారని అన్నారు. టీడీపీ అనే పదాన్ని వదిలేసి ‘మీ ఇంటికి మీ వర్మ’ అని పెట్టుకుని తిరిగినప్పుడే మీరు పార్టీని నాశనం చేస్తున్నారని, ఇతర పార్టీల వైపు చూస్తున్నారని అధిష్టానానికి అర్థమయ్యిందన్నారు. గతంలో నాయకులందరం కలిసి కట్టుగా పని చేస్తేనే ఆయన ఎమ్మెల్యే అయ్యారన్న సంగతి మర్చి పోయి గ్రూపు రాజకీయాలు చేసి అందరిని విడగొట్టి విభజించు పాలించు అనే ధోరణితో పార్టీని ముక్కలు చేస్తున్నారని ఆయన వర్మపై మండిపడ్డారు.
నన్ను రెచ్చగొడితే నీ జాతకాన్ని బయటపెడతానంటూ హెచ్చరించారు. నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు జ్యోతుల సతీష్, మాట్లాడుతూ కనీసం షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని సస్పెండ్ చేసినట్లు ప్రకటించడం వర్మ నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. అసలు పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నది ఎవరో పార్టీ అధిష్టానం దగ్గరే తేల్చుకుంటామని అన్నారు. టీడీపీ నేతలు కె.సత్యనారాయణ, పినకా వెంకట్రావు, వీఎస్ నారాయణ, గురాల వీరాస్వామి, చోడిశెట్టి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment