
వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే రసమయి, సత్యనారాయణ
కరీంనగర్: మండలంలోని కొత్తపల్లిలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ మానకొండూర్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ మధ్య బుధవారం వాగ్వాదం జరిగింది. ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన వివాహనికి మొదట సత్యనారాయణ హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. తర్వాత తన కార్యకర్తలతో కూర్చొని, మాట్లాడుతుండగా ఎమ్మెల్యే రసమయి వచ్చారు. వధూవరులను ఆశీర్వదించి, వేదిక దిగుతూ ఆయనను నమస్తే అంటూ పలకరించారు.
దీంతో సత్యనారాయణ ‘నువ్వెవరివి నన్ను విష్ చేసేందుకు’ అంటూ మండిపడ్డారు. ఇరువర్గాలవారు కొద్దిసేపు గొడవ పడ్డారు. రాజకీయాల్లో శత్రువులు ఉండటం సహజమని, ఒకరినొకరు పలకరించుకోవడాన్ని రాజకీయ కోణంలో చూసి, వాగ్వాదానికి దిగిన సత్యనారాయణపై బీఆర్‌ఎస్ నాయకులు విమర్శలు చేశారు. గొడవ చేయడం కోసమే రసమయి ఆయనను పలకరించినట్లు నాటకం ఆడారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు దీన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.