చొక్కారావు (ఫైల్), గంగుల కమలాకర్
సాక్షి, కరీంనగర్: ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్‌లో ఏ ఎన్నిక జరిగినా ప్రతిష్ఠాత్మకమే.. అన్ని పార్టీలకూ కీలకమే. ఇక్కడి ఓటర్లు ప్రతీ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పునిస్తూ భిన్న పార్టీలకు చెందిన ఎందరో నాయకులను ఆదరించారు. ఓసీలకు ముఖ్యంగా వెలమలకు ఒకప్పుడు కంచుకోటలా ఉండేది.
ఒక్క 2018 ఎన్నికల్లో మాత్రమే ఓసీ అభ్యర్థి లేకుండా ఎన్నిక జరగడం విశేషం. ఒకే వ్యక్తికి రెండు పర్యాయాలు అవకాశమిచ్చినా.. మరో ఎన్నికల్లో వేరేవారిని ఎన్నుకున్నా.. పనితీరు బాగోలేకుంటే నిర్మొహమాటంగా వేరే అభ్యర్థిని గెలిపించుకున్నా అది కరీంనగర్ అసెంబ్లీ ప్రజానీకానికే చెల్లింది. ప్రతీ ఎన్నికల్లో విజేత ఎంపిక విషయంలో కడదాకా ఎడతెగని ఉత్కంఠను చూపిస్తూనే ఉన్నారు.
ఘన చరిత్ర..
ఉత్తర తెలంగాణకు కేంద్ర బిందువైన కరీంనగర్ నియోజకవర్గానికి ఘన చరిత్ర ఉంది. నిజాం నవాబు మెడలు వంచడంలో, రైతాంగ ఉద్యమం, తెలంగాణ తొలి, మలి దశ పోరాటాల్లో పాత్ర అనిర్వచనీయం. దొరల దాష్టీకానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల, ఉన్నవాడి నుంచి పేదోళ్లకు పంచేందుకు నక్సల్స్, జనశక్తి పార్టీలు చేసిన భూపోరాటాలు చరిత్రలో నిలిచిపోయాయి.
తెలంగాణ సాయుధ సమరానికి సైరన్ మోగించిన ముగ్గురిలో ఒకరైన బద్దం ఎల్లారెడ్డి, రాజకీయ ఆగ్రగన్యులైన జువ్వాడి చొక్కారావు, ఎమ్మెస్సార్, చెన్నమనేని విద్యాసాగర్‌రావు, ప్రస్తుత సీఎం కేసీఆర్ లాంటి అగ్రనేతలంతా కరీంనగర్ కేంద్ర బిందువుగా ఉద్యమ వాడివేడిని రగిలించినవారే. మలిదశ పోరాటంలో 2001లో టీఆర్‌ఎస్ పార్టీ స్థాపించగా ఎస్సారార్ కళాశాల వేదికగా సింహగర్జన బహిరంగ సభ జరిగింది ఇక్కడే. ఇటీవల అమరుడైన ప్రజాయుద్ధ నౌక గద్దర్ సారథ్యంలో పీపుల్స్ వార్ రైతు కూలీ సంఘం భారీ బహిరంగ సభ కరీంనగర్ బస్‌స్టేషన్ ప్రాంగణ సమీపంలోనే నిర్వహించారు. ఇది రైతాంగ ఉద్యమానికి నాంది పలికింది.
1952లో నియోజకవర్గం ఏర్పాటు!
కరీంనగర్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 66 ఏళ్ల క్రితం 40 వేల ఓటర్లు ఉండగా.. ప్రస్తుతం 3,41,913కు పెరిగారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గతంలో ఉన్న తిమ్మాపూర్, మానకొండూర్ మండలాలు కొత్తగా ఏర్పడిన మానకొండూర్ నియోజకవర్గంలో కలిశాయి. దీంతో కేవలం కరీంనగర్ పట్టణం, కరీంనగర్‌రూరల్, కొత్తపల్లి మండలాలు మాత్రమే కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్నాయి.
వ్యవసాయం.. పరిశ్రమలు.. కళాశాలలు
నియోజకవర్గానికి వ్యవసాయమే కీలకం. కొత్తపల్లి మండలం, కొత్తపల్లి మున్సిపాలిటీలలో గ్రానైట్, పాలిషింగ్ పరిశ్రమలు, క్వారీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. రైతులు పత్తి, వరి, మొక్కజొన్న సాగు చేస్తున్నారు. 3 వైద్య కళాశాలలు, మొక్కజొన్న పరిశోధన కేంద్రం, 6 ఇంజినీరింగ్ కళాశాలలు, శాతవాహన విశ్వవిద్యాలయం, రెండు నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి. ఇటీవల స్మార్ట్‌సిటీ రోడ్లు, ఐటీ టవర్, కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్‌లతో నగరం పర్యాటక శోభ సంతరించుకుంది. సామాజికవర్గాల వారీగా మున్నూరు కాపు, పద్మశాలీ, గౌడ, యాదవ, ముదిరాజ్ కులాల ఓట్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసేలా ఉన్నాయి.
మంత్రులుగా పని చేసిన ముగ్గురు..
ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో పేరొందిన నాయకుడు ఎం.సత్యనారాయణరావు(ఎమ్మెస్సార్). తెలంగాణ ప్రజా సమితి నుంచి 1971లో, కాంగ్రెస్(ఐ) నుంచి 1977, 1980లలో కరీంనగర్ ఎంపీగా గెలిచారు. అనూహ్యంగా 2004లో ఎమ్మెల్యేగా పోటీ చేసి, కీలక నేతగా ఎదిగారు. ఇక్కడి నుంచి గెలిచినవారిలో జువ్వాడి చొక్కారావు జలగం వెంగళరావు కేబినెట్‌లో, సి.ఆనందరావు ఎన్టీఆర్ మంత్రి వర్గంలో, ఎమ్మెస్సార్ వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో పని చేశారు. ఎమ్మెస్సార్ పీసీసీ అధ్యక్షుడిగా, ఆర్టీసీ చైర్మన్‌గా కొనసాగారు.
ఇవి చదవండి: పెద్దమంగళారం 'పంచాయతీ టు అసెంబ్లీ'
Comments
Please login to add a commentAdd a comment