వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు | Sakshi
Sakshi News home page

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు

Published Sat, May 25 2024 12:50 AM

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు

● కలెక్టర్‌ పమేలా సత్పతి

హుజూరాబాద్‌/హుజూరాబాద్‌ రూరల్‌/మానకొండూర్‌: వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించొద్దని, ప్రయివేటు ఆస్పత్రులకు ధీటుగా సేవలు అందించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి సూచించారు. శుక్రవారం హుజూరాబాద్‌లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ప్రతీ వార్డును పరిశీలించారు. దాదాపు రెండు గంటల పాటు ఆస్పత్రిలో పర్యటించారు. రోగులతో మాట్లాడారు. వైద్య సేవలపై ఆరా తీశారు. డయాలసిస్‌ కేంద్రం, ఆపరేషన్‌ థియేటర్‌, మందులు నిల్వ ఉంచే గది, మెటర్నిటీ వార్డు, లేబర్‌రూంతో పాటు, పలు వార్డులను తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. సాధారణ ప్రసవాలు పెరిగేలా కృషి చేయాలని సూచించారు. మందుల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఆసుపత్రిలోని ల్యాబ్‌ను పరిశీలించి రోజుకు ఎంతమందికి పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆరా తీశారు. దాదాపు 500 మందికి పరీక్షలు చేస్తున్నామని సిబ్బంది వివరించారు. ఇంక్యూబేటర్‌ గదిని సందర్శించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో చందు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజేందర్‌రెడ్డి, తహసీల్దార్‌ విజయ్‌ కుమార్‌, ఎంపీడీవో సునీత, వైద్యులు శ్రీకాంత్‌రెడ్డి, వాణిలత, సోమశేఖర్‌ పాల్గొన్నారు.

సౌకర్యాలు కల్పించాలి

విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. హుజూరాబాద్‌ మండలం రాజావల్లి గ్రామంలోని అమ్మ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. వాష్‌ రూముల్లో టైల్స్‌ వేయించాలని సూచించారు. పాఠశాలలోని ఖాళీస్థలంలో పండ్లు, పూల మొక్కలు పెంచాలన్నారు. మానకొండూరులోని రుద్రమ మండల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళా కుట్టుశిక్షణ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్‌ విద్యార్థులకు అందించే యూనిఫాం మన్నికగా కుట్టించాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళలు కుడుతున్న యూనిఫాంలను పరిశీలించారు. జూన్‌ 5లోపు విద్యార్థులకు డ్రెస్‌లను అందించాలని, అవసరమైన ఖర్చులను తాను అందిస్తానని తెలిపారు. డీఆర్డీవో శ్రీధర్‌, ఏపీఎం నిరంజన్‌, సంతోష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement