తిట్ల పురాణాలకు వేదికలుగా సీఎం సభలు
కరీంనగర్‌టౌన్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయోత్సవ సభల పేరిట నిర్వహిస్తున్న సభలు పూర్తిగా తిట్ల పురాణాలకు వేదికలుగా మారాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. గురువారం కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి, హుజురాబాద్ నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల బీజేపీ ముఖ్య నేతల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చిందని, ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, డిక్లరేషన్‌ల గురించి నోరెత్తకుండా 11 నెలల కాలంగా కాంగ్రెస్ సర్కార్ టైం పాస్ చేస్తుందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు బీజేపీ పోరాటం ఆపదని అన్నారు. నియోజకవర్గంలోని బీజేపీ శ్రేణులు అందరూ పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల పర్వం ప్రారంభమవుతున్న దృష్ట్యా బూత్ స్థాయి ఎన్నికల కోసం సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశాల్లో ఆయా నియోజకవర్గాల అసెంబ్లీ కన్వీనర్లు, జిల్లా, రాష్ట్ర నాయకులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment