వ్యక్తి ఆత్మహత్య
జ్యోతినగర్(రామగుండం): రామగుండం కార్పొరేషన్ నాలుగో డివిజన్ కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్న చెందిన వేముల రాజమౌళి(41) ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రాజమౌళి స్వస్థలం వరంగల్ రూరల్ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామం. ఇతనికి భార్య సుకన్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఐదేళ్ల క్రితం భార్యాపిల్లలతో కలిసి కృష్ణానగర్ వచ్చాడు. ఎఫ్‌సీఐ క్రాస్‌రోడ్‌లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం సుకన్య, ఇద్దరు పిల్లలు బయటకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాజమౌళి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. స్థానికులు మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కాగా, అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
నిప్పంటించుకొని యువకుడు..
కథలాపూర్(వేములవాడ): కథలాపూర్ మండలంలోని చింతకుంటకు చెందిన అందె రాము(32) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. రాముకు ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన సౌందర్యతో ఏడాది క్రితం వివాహం జరిగింది. దంపతుల మధ్య గొడవలు జరగడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపానికి గురైన రాము సోమవారం సాయంత్రం గ్రామ శివారులోని గుట్ట వద్దకు వెళ్లి, ఒంటిపై పెట్రోల్ పోసుకొని, నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఒకరి బలవన్మరణం
కోరుట్ల: పట్టణంలోని ఐబీ రోడ్‌లో నివాసం ఉండే రాజన్న(56) ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. ఖానాపూర్‌కు చెందిన రాజన్న కొంతకాలంగా కోరుట్లలో వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తూ భార్య భీమక్క, పిల్లలతో కలిసి ఇక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో దంపతుల మధ్య గొడవ జరగడంతో భీమక్క పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్తాపానికి గురైన రాజన్న సోమవారం గదిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
అప్పు కింద ట్రాక్టర్ తీసుకెళ్లిన ముగ్గురిపై కేసు
చందుర్తి(వేములవాడ): ఇచ్చిన అప్పు కింద ట్రాక్టర్ తీసుకెళ్లిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు చందుర్తి పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. చందుర్తి మండలంలోని నర్సింగాపూర్‌కు చెందిన బొడ్డు అంజయ్య మండల కేంద్రానికి చెందిన కట్ట శేఖర్ వద్ద నాలుగేళ్ల క్రితం రూ.50 వేలు అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లించాలని శేఖర్ పలుమార్లు అడిగినా చెల్లించలేదు. దీంతో అతను గతంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే 3 నెలల్లో ఇస్తానని ఒప్పుకున్నాడు. గడువు ముగిసినా ఇవ్వలేదు. కోపోద్రిక్తుడైన శేఖర్ మేడిఽశెట్టి శంకర్, పత్తిపాక వెంకటేశంలతో కలిసి వారం రోజుల క్రితం అంజయ్యకు చెందిన ట్రాక్టర్‌ను తీసుకెళ్లారు. బాధితుడు సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
పోక్సో కేసులో
ఆరుగురికి ఏడాది జైలు
సిరిసిల్ల కల్చరల్: పోక్సో కేసులో ఆరుగురికి ఏడాది జైలుశిక్ష విధిస్తూ రాజన్నసిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి, పోక్సో కోర్టు ఇన్‌చార్జి జడ్జి ఎన్.ప్రేమలత తీర్పునిచ్చారు. ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాల ప్రకారం.. వేములవాడకు చెందిన ఓ బాలిక తమ ఇంటి సమీపంలో ఉండే దొమ్మటి ఆనంద్, గొల్లపల్లి శశి, పబ్బ రాజేశ్, గౌరవేని నాగరాజు, సయ్యద్ సోహెల్, బొమ్మడి గణేశ్‌లు తనను లైంగికంగా వేధిస్తున్నారని 2018 ఏప్రిల్ 12న పోలీసులకు ఫిర్యాదు చేసింది. వేములవాడ టౌన్ సీఐ వెంకటస్వామి వారిపై పోక్సో కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. ప్రాసిక్యూషన్ తరఫున పెంట శ్రీనివాస్ కేసు వాదించారు. 8 మంది సాక్షులను విచారించారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన జడ్జి ఆ ఆరుగురికి ఏడాది జైలుశిక్షతోపాటు రూ.1,000 చొప్పున జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment