కలిసి నడుస్తూ.. అండగా నిలుస్తూ
● తోటి వాకర్స్ కుటుంబాలకు, అభాగ్యులకు ఆర్థికసాయం
● ఐదేళ్లలో రూ.10 లక్షల వరకు అందజేత
● ఆదర్శం.. గోదావరిఖని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు
గోదావరిఖని: ఆరోగ్యం కోసం వాకింగ్ అవసరం.. ఇందుకోసం మైదానం కావాలి.. మైదానానికి వెళ్లేవారికి స్నేహం ఉండాలి.. ఆ స్నేహం చేసే పరోపకారంతో సమాజానికి మేలు.. ఇదే లక్ష్యంతో 2019 ఏప్రిల్‌లో గోదావరిఖని సింగరేణి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆవిర్భవించింది. అంతటితోనే ఆగలేదు.. మిత్రులకు ఎలాంటి ఆపద వచ్చినా అండగా నిలుస్తోంది. ఆర్థిక సాయం చేస్తూ తామున్నామంటూ భవిష్యత్‌పై భరోసా కల్పిస్తోంది.
అన్ని వర్గాలవారు 220 మంది..
పారిశ్రామిక ప్రాంతంలోని అన్ని వర్గాలకు చెందిన సుమారు 220 మంది జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో రోజూ వాకింగ్ చేస్తున్నారు. వీరిలో 150 మందికి తక్కువ కాకుండా నిత్యం వాకింగ్ కోసం మైదానానికి చేరుకుంటారు. వీరిలో రాజకీయ నాయకులు, టీచర్లు, ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగులు, సింగరేణి కార్మికులు, పోలీసులు, వ్యాపారులు ఉన్నారు. వీరంతా ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. ఆర్థికసాయం కావాలని ఎవరైనా అభ్యర్థిస్తే ఆ సమాచారాన్ని గ్రూప్‌లో పోస్టు చేస్తారు. సభ్యులందరూ స్పందించి, తోచిన సాయం చేస్తారు. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని వాకింగ్ చేసే మైదానంలోనే అందరి సమక్షంలో బాధితులకు అందజేస్తున్నారు. తొలుత చిన్న మొత్తంతో ప్రారంభమైన సాయం ఆ తర్వాత రూ.2 లక్షలకు.. ఇప్పుడు రూ.10 లక్షలకు చేరుకుంది. సుమారు ఐదేళ్లలో 25 మంది అభాగ్యులకు ఆర్థికసాయం చేశారు. అంతేకాదు, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంటున్నారు.
రఘు వారధి..
సింగరేణి సింగరేణి స్టేడియంలో వాకింగ్ చేసేందు వచ్చే వారందకీ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దాసరి రఘు వారధిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. వాకర్లను సమన్వయపరుస్తూ ఆర్థిక సాయం పోగుచేసి, అందరి సమక్షంలో బాధితులకు అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment