మాడి, మెత్తగా అయిన అన్నం
ఈనెల 12న తిమ్మాపూర్ మండలం రామకృష్ణాకాలనీలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో అన్నం ముద్దగా ఉందంటూ విద్యా ర్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
మూడు రోజుల క్రితం గంగాధర మండలం బూర్గుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 18మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
జిల్లా కేంద్రంలోని పురాతన పాఠశాలలో మధ్యాహ్న భోజనం మాడిపోయిందని, మెత్తగా ఉందని సోమవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ మూడు చోట్ల నాసిరకం బియ్యం కారణంగానే సమస్య తలెత్తిందని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు చెప్పుకొచ్చారు.
కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం గాడి తప్పుతోంది. విద్యార్థులకు కుళ్లిన కూరగాయలు, పనికిరాని పప్పు దినుసులు, నీళ్లచారు, సాంబారు, నాసిరకం బియ్యం, కోడిగుడ్లు అందిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల పాఠశాలలకు పంపిణీ చేసిన బియ్యం నాసిరకంగా ఉండడంతో జిల్లాలోని పలుచోట్ల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. నిత్యం ఎక్కడో ఒకచోట విద్యార్థులు వాంతులు చేసుకోవడం, ఆస్పత్రుల పాలవ్వడం రివాజుగా మారింది. కొత్త బియ్యంతోనే సమస్య తలెత్తిందని, తక్షణమే బియ్యాన్ని వాపసు తీసుకోవాలని, గౌరవ వేతనం పెంచి నాణ్యమైన సరుకులు ఇస్తే విద్యార్థులకు రుచికరమైన ఆహారం అందజేస్తామని వంట ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.
జిల్లాలో మధ్యాహ్న భోజన పరిస్థితి
జిల్లావ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం 722 ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతోంది. 56వేల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. 3,217 మంది నిర్వాహకులకు ఉపాధి లభిస్తోంది. మ ధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పథకం నీరుగారిపోతోంది. నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం మెనూ చార్జీలను ఇటీవల పెంచినా.. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. మధ్యాహ్న భోజన నిర్వాహకులకు ఏడాదిగా కోడిగుడ్ల బిల్లు, ఆరు నెలలుగా గౌరవ వేతనం అందడం లేదు. ప్రస్తుతం నాసిరకమైన బియ్యం పంపిణీ అవుతుండడంతో అన్నం ముద్దలు అవుతోందని వంట ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు.
పర్యవేక్షించని కమిటీలు..
మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు జరిగేందుకు మండలస్థాయిలో పర్యవేక్షణ కమిటీలుంటాయి. ఎంపీడీవో, ఎంఈవోతో పాటు ఈవోపీఆర్డీలతో విద్యాశాఖ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యులు ప్రతిరోజు ఏదో ఒక పాఠశాలను తనిఖీ చేసి, మధ్యాహ్న భోజనం, అక్కడి పారిశుధ్యం ఇతర వివరాలు 15రోజులకోసారి జిల్లా విద్యాశాఖాధికారికి నివేదించాలి. జిల్లాలో ఈ విధానం ఎక్కడా అమలు కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment