ఏసీబీ వలలో ఇరిగేషన్ ఏఈ
● రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
పెద్దపల్లిరూరల్: కలెక్టరేట్ ఎదురుగా గల జిరాక్స్ సెంటర్ వద్ద ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి కథ నం ప్రకారం.. జిల్లాలోని జూలపల్లి మండలం కాచాపూర్ శివారులోని ఎస్సారెస్పీ డి–83 ప్రధానకాలువ వద్ద శిథిలమైన వంతెన మరమ్మతు చేపట్టారు. ధర్మారం మండలం దొంగతుర్తికి కాంట్రాక్టర్ తమ్మడవేని శ్రీనివాస్‌కు పనులు అప్పగించారు. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్.. బిల్లు మంజూరు చేయాలని ఏఈ నర్సింగరావును కోరారు. బిల్లు మంజూరు చేయాలంటే తనకు రూ.40వేలు లంచం ఇవ్వాలని ఏఈ డిమాండ్ చేశారు. చేసేదిలేక శ్రీనివాస్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు సోమవారం రూ.20 వేలను ఏఈ నర్సింగరావు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమణామూర్తి ఆధ్వర్యంలో అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఆయనను కార్యాలయానికి తీసుకెళ్లి రికార్డులు తనిఖీ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపడతామని డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.
బిల్లులో సగం ఇవ్వాలన్నారు
కాచాపూర్‌లోని ఎస్సారెస్పీ ప్రధాన కాలువ వంతెన మరమ్మతుకు రూ.91,703 ఎంబీ రికార్డులో నమోదు చేశారు. ఆ బిల్లు మంజూరు కావాలంటే అందులో సగం తనకు లంచంగా ఇవ్వాలని ఏఈ నర్సింగరావు డిమాండ్ చేశారు. ఒప్పందం ప్రకారం ఈనెల 18న తొలివిడత రూ.20వేలు ఇస్తానని చెప్పిన. ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన. వారి సూచనలమేరకు లంచం ఇస్తుండగా పట్టుకున్నారు.
– తమ్మడవేని శ్రీనివాస్, కాంట్రాక్టర్
Comments
Please login to add a commentAdd a comment