కండ్లపల్లిలో అపురూప శిల్పాలు
సారంగాపూర్: జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కండ్లపల్లి గ్రామంలో 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం మధ్యకాలంనాటి వివిధ రూపాల్లో ఉన్న శిల్పాలు పదులకొద్ది బయటపడ్డాయి. తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ ఆధ్వర్యంలో వొద్ధిపర్తి మధుకుమార్, చిట్నేని విజయ్‌కుమార్ కలిసి వారం రోజులుగా పరిశోధనలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో వెలుగుచూసిన శిల్పాలను ఒక చోటకు చేర్చి అవి ఏ కాలంలోనివో గుర్తిస్తున్నారు. ఈ మేరకు బుధవారం వాటి వివరాలను వెల్లడించారు. తమ పరిశోధనలో రాష్ట్రకూటశైలితో జైన తీర్థంకరుడు, ఋషబుని ధ్యానసన శిల్పం, రెండు వృషభలాంఛనాలతో ఋషబుని శిల్ప స్తంభాలు బయటపడ్డాయని, వర్ధమహావీరుని అధిష్టాన పీఠం, జైనబసది పూర్ణకలశం, 14, 15 శతాబ్దాల శైలిలో గణపతి, కేశవమూర్తులు ఇద్దరు, కుభేరుడు, విష్ణుమూర్తి, మహిషాసురమర్థిని, నాగదేవత తదితర శిల్పాలు వెలుగు చూశాయన్నారు. 17, 18వ శతాబ్దాల కాలం నాటి శైలిలో చెక్కిన లోహకారుల దేవతా మమ్మాయి శిల్పాలు, పూర్తిగా శిథిలమైన రెండు బహుభుజుల దేవతల శిల్పాలు, మరోచోట జైన తీర్థంకరుని శిల్పంతో శాసన స్తంభం బయటపడ్డాయన్నారు.
గ్రామంలో ఎటుచూసినా శిల్పాలే..
కండ్లపల్లి గ్రామంలో ఎటు చూసినా వివిధ రూపాల్లో శిల్పాలు ఉన్నాయని చరిత్రకారులు వివరించారు. వీటిపై గ్రామస్తులకు పెద్దగా అవగాహన లేకపోవడంతో విగ్రహాలు గడ్డి, చెత్తలోనే ఉండిపోయాయి. కొందరు తమతమ భూములకు హద్దురాళ్లుగాను పెట్టుకున్నారు. ఇలాంటి వాటిపై పరిశోధన జరిపిన చరిత్ర బృందం సభ్యులు విజయ్‌కుమార్, మధుకుమార్ వివరాలు వెల్లడించడంతో గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎటు చూసినా శిల్ప సంపద ఉన్న తమ గ్రామ వివరాలను ఎప్పుడూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదని, వీటిపై మరిన్ని పరిశోధనలు చేయాలని గ్రామస్తులు గంగధరి పూర్ణచందర్, పర్వతం రమేశ్, వడ్లూరి రవి, కోట కిషన్, గంగధరి శ్రీనివాస్, గంగధరి శంకర్, అజ్మీర లక్ష్మణ్, గంగధరి గంగాధర్, కంది భీమన్న చరిత్రకారులను కోరారు. ప్రభుత్వం స్పందించి అద్భుతమైన ఇలాంటి వారసత్వ సంపదను పరిరక్షించాలని కోరారు.
వెయ్యేళ్ల నాటివిగా చెబుతున్న చరిత్రకారులు జైనం, శైవం, వైష్ణవ శిల్పాలుగా ఆనవాళ్లు
Comments
Please login to add a commentAdd a comment