హెల్త్ చెకప్‌కు వెళ్తూ హఠాన్మరణం
రామగుండం: అంతర్గాం మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి(ఎంపీడీవో) మహ్మద్ అబ్దుల్ అలీం(60) హెల్త్‌చెకప్ కోసం వెళ్తూ గుండెపోటుతో కన్నుమూశారు. వారంరోజులుగా అనారోగ్యంతోనే బాధపడుతున్నారు. అయినా, ప్రజాపాలన గ్రామసభలకు హాజరవుతూనే అధికారుల సాయంతో సంక్షేమ పథకాల ప్రక్రియ చేపడుతున్నారు. అయితే, డాక్టర్లను సంప్రదించేందుకు బుధవారం ఉదయం హైదరాబాద్‌కు కారులో వెళ్తున్నారు. మార్గమధ్యంలోనే గుండెపోటు రావడంతో చనిపోయారు. అంతర్గాం ఎంపీడీవోగా ఆయన గతేడాది ఫిబ్రవరి 13న బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది ఆగస్టు 30న ఉద్యోగ విరమణ చేయనున్నారు. అలీం స్వస్థలం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ కాగా మంచిర్యాలలో నివాసం ఉంటున్నారు. విధుల నిర్వహణకు అక్కడి నుంచి వచ్చివెళ్తున్నారు. ఆయనకు ఒక కుమారుడు, భార్య ఉన్నారు. మృతదేహాన్ని కాగజ్‌నగర్ తరలించారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అలీం మృతదేహానికి నివాళి అర్పించారు. ఎంపీపీ సూపరింటెండెంట్ కరుణాకర్, సిబ్బంది, సీఐ ప్రవీణ్, ఎస్సై వెంకటస్వామి తదితరులు అలీం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కలెక్టర్ పరామర్శ
పెద్దపల్లిరూరల్: ఎంపీడీవో అలీం కుటుంబసభ్యులను కలెక్టర్ కోయ శ్రీహర్ష పరామర్శించారు. గుండెపోటుకు గురైన మహ్మద్ అలీంను తొలుత పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు రాగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న కలెక్టర్ కోయ శ్రీహర్ష, అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ ఆస్పత్రికి చేరుకుని నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్, పలువురు అధికారులు ఉన్నారు.
గుండెపోటుతో అంతర్గాం ఎంపీడీవో అలీం మృతి
Comments
Please login to add a commentAdd a comment