బనశంకరి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు 29వ తేదీ ప్రధాని నరేంద్రమోదీ బెంగళూరులో పర్యటించి భారీ రోడ్ షో నిర్వహిస్తారు, ఇందులో ప్రధాని ప్రయాణించడానికి బులెట్ ప్రూఫ్ వాహనం సిద్ధమైంది. ఢిల్లీ నుంచి ప్రధాని భద్రతా విభాగం ఈ వాహనాన్ని రాష్ట్రానికి తరలించింది. మైసూరు, కలబురిగి జిల్లాల్లో కూడా ఇదే వాహనంలో రోడ్ షోలలో పాల్గొంటారు. ప్రధాని రోడ్ షో నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి మాగడి రోడ్డును బంద్ చేస్తారు. మోదీ బెళగావి నుంచి సాయంత్రం 4.30 గంటలకు బెంగళూరు హెచ్‌ఏఎల్ విమానాశ్రయంలో దిగతారు. అక్కడి నుంచి తుమకూరు రోడ్డు బీఐఈసీ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. నైస్‌రోడ్డు ద్వారా మాగడి రోడ్డులో ప్రయాణిస్తారు. మాగడి రోడ్డు నుంచి సుమనహళ్లి వరకు రోడ్‌షో సాగుతుంది. మోదీ వచ్చే గంట ముందు నుంచి నైస్‌రోడ్డులో ట్రాఫిక్‌ని నిలిపేస్తారు.
రేపు మైసూరులో మోదీ సభ
మైసూరు: ప్రధాని మోదీ ఈ నెల 30వ తేదీన మైసూరులో బహిరంగ సభలో పాల్గొంటారని ఎమ్మెల్యే రామదాసు తెలిపారు. శుక్రవారం ఆయన పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ మహారాణి కాలేజీ మైదానంలో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు.
ఆదివారం రామనగర, కోలారులో
దొడ్డబళ్లాపురం: ప్రధాని మోదీ ఈ నెల 30న రామనగరలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నందున పోలీసులు, అధికారులు భద్రతను ముమ్మరంచేశారు. బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే పై వాహనాల సంచారంలో మార్పులు చేశారు. ఆరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ చెన్నపట్టణ నుంచి మద్దూరుకు రహదారిని మూసివేస్తారు. ఈ సమయంలో బెంగళూరు నుంచి మైసూరుకు వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి. అలాగే ఆదివారం కోలారు జిల్లాలో జరిగే ఎన్నికల బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. శుక్రవారం హెలికాప్టర్ రిహార్సల్స్‌ను నిర్వహించారు. భారీ సభాస్థలి సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment