అరేబియా సముద్రంలో నలుగురు బాలికల జలసమాధి
కోలారు జిల్లా నుంచి స్టడీ టూర్‌కు వెళ్లిన విద్యార్థులు
కన్నవారికి తీరని శోకం
∙హెచ్‌ఎంపై సస్పెన్షన్ వేటు, కేసు
కొత్త ప్రాంతాలను చూడాలనే ఉత్సాహంతో కేరింతలు కొడుతూ బస్సులో బయల్దేరారు. ఎప్పుడూ చూడని సముద్రాన్ని చూసి సంతోషంతో ఉప్పొంగారు. కానీ అదే చివరి మజిలీ అవుతుందని అనుకోలేదు. సముద్రంలో అలల ధాటికి నీటిలోకి కొట్టుకుపోయి నలుగురు బాలికలు విగతజీవులయ్యారు. విహారయాత్ర కాస్తా శోకసంద్రంగా మారిపోయింది. కన్నవారి ఆవేదన వర్ణనాతీతం. ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణమని వారు విలపించారు.
శివాజీనగర: కోలారు జిల్లా ముళబాగిలు తాలూకా కొత్తనూరులోని మొరార్జీ దేశాయి రెసిడెన్సియల్ పాఠశాల పిల్లలు, ఉపాధ్యాయులు కలిసి విద్యా విహార యాత్రకు ఉత్తర కన్నడ జిల్లాకు వెళ్లారు. సుమారు 50 మంది విద్యారి్థనీ విద్యార్థులు, 7 మంది ఉపాధ్యాయులు టూర్‌కు బస్సు వేసుకుని వచ్చారు. మంగళవారం సాయంత్రం మురుడేశ్వరలో అరేబియా సముద్ర తీరంలో పిల్లలు ఆడుకుంటూ ఉండగా, ఉవ్వెత్తున లేచిన అలల ఉధృతిలో చిక్కుకొని 7 మంది విద్యార్థులు కొట్టుకుపోయారు.
వారిలో ముగ్గురిని అక్కడి లైఫ్ గార్డ్ సిబ్బంది రక్షించారు. మిగతావారి ఆచూకీ దొరకలేదు. కొంతసేపటికి నలుగురు బాలికల్లో ఒకరి మృతదేహం తీరానికి కొట్టుకువచ్చింది. అప్పటినుంచి స్థానిక పోలీసులు, కరావళి కాపలా దళంతో పాటు స్థానిక ఈతగాళ్లు ముమ్మరంగా గాలింపు జరిపారు. బుధవారం మిగతా ముగ్గురు కూడా శవాలై కనిపించారు. మృతులు దీక్ష, లావణ్య, వందన, స్రవంతిగా గుర్తించారు. వీరందరూ 15 ఏళ్ల వయసువారే. 9వ తరగతి చదువుతున్నారు. మరో ముగ్గురు బాలికలు నీట మునగడంతో అస్వస్థతకు గురికాగా వారిని సమీప ఆస్పత్రిలో చేరి్పంచారు.
టీచర్లపై కేసు
ఈ సంఘటనలో సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలితో పాటుగా 6 మందిపై సుమోటోగా కేసు నమోదైంది. ప్రధానోపాధ్యాయురాలు శశికళ (40) ఉపాధ్యాయ సిబ్బంది సునీల్ (33), చౌడప్ప (34) ఎస్.విశ్వనాథ్ (27) సీఎన్ శారదమ్మ (37), కే.నరేశ (30) తదితరులపై మురుడేశ్వర పోలీసులు కేస్ నమోదు చేశారు. వీరి నిర్లక్ష్యం వల్లనే ఈ ఘోరం జరిగిందని పేర్కొన్నారు.
బీచ్ మూసివేత
ఈ దారుణం తరువాత జిల్లా అధికారులు పర్యాటకుల భద్రతరీత్యా మురుడేశ్వర బీచ్‌ను తాత్కాలికంగా బంద్ చేస్తున్నట్లు తెలిపారు. బీచ్‌లోని వారందరినీ బయటకు పంపించేశారు. మంగళవారం అక్కడక్కడ బ్యారికేడ్లు పెట్టి అదనపు పోలీస్ సిబ్బందిని నియమించారు.
రూ. 5 లక్షల పరిహారం: సీఎం
మృతి చెందిన బాలికల కుటుంబానికి సీఎం సిద్దరామయ్య రూ.5 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ సంఘటన చాలా విషాదకరమని, పిల్లల ఆత్మకు శాంతి కలగాలని ఆయన సంతాపం తెలిపారు. త్వరగా మృతదేహాలను సొంతూళ్లకు చేర్చే ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పర్యటనల సమయంలో ఉపాధ్యాయులు పిల్లల గురించి చాలా జాగ్రత్తలు ఉండాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కారాదని పేర్కొన్నారు.
ఈ బీచ్ ఎందుకు డేంజర్
ఎంతో ఆహ్లాదకరంగా కనిపించే మురుడేశ్వర సముద్ర తీరం అంతే ప్రమాదకరమైనది కూడా. ఇది స్థానికులకు తెలుసు కానీ, బయటి నుంచి వచ్చే పర్యాటకులకు కాదు. టూరిస్టులు అందమైన తీరాన్ని చూడగానే మైమరచిపోయి అందులో లోపలికి వెళ్తుంటారు. కానీ ఆకస్మికంగా అలలు పోటెత్తుతాయి. సుడిగుండాల వంటి ప్రవాహాలు కూడా సంభవిస్తుంటాయి. ఇవి ఎవరినైనా సముద్రంలోకి లాక్కుపోతాయి. అదే రీతిలో ఈ దుర్ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. అదీ కాక బీచ్ చాలా లోతుగా ఉంటుంది. అందుకే అధికారులు అక్కడక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టారు.
కానీ ఉత్సాహంగా ఉండే టూరిస్టులకు వాటిని పట్టించుకునే తీరిక ఉండదు. జూన్ నుంచి రుతు పవనాల రాకతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. అప్పటి నుంచి ముప్పు మరింత పెరుగుతుంది. ఈ బీచ్‌లో ప్రతి నెలా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో అధికారులు సుశిక్షితులైన గజ ఈతగాళ్లను అక్కడ నియమించారు. మునిగిపోయేవారిని గుర్తించి వీరు కాపాడుతుంటారు. లేదంటే ప్రాణనష్టం మరింత ఎక్కువుగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment