మెట్రో చార్జీల పెంపు లేనట్టే!
● బ్రేక్ వేసిన కేంద్ర సర్కారు
శివాజీనగర: బెంగళూరు నమ్మ మెట్రో చార్జీల ప్రతిపాదనకు బ్రేక్ పడినట్లు తెలిసింది. త్వరలో చార్జీలు పెంచబోతున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం మెట్రో అధికారులను వివరణ అడిగినట్లు సమాచారం. ఏదైనా నిర్ణయం తీసుకునేముందు తమకు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. చార్జీల పెంపును కేంద్రం నిలుపుదల చేసిందని బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీ.సీ.మోహన్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి మెట్రో రైలు చార్జీలను 45 శాతం పెంచాలనే ప్రతిపాదనను నిలిపివేయడమైనది. ఇది బెంగళూరు ప్రజలకు ఒక పెద్ద గెలుపు. త్వరలో న్యాయసమ్మతమైన ధరను నిర్ణయిస్తారు అని పోస్టులో తెలిపారు.
ఇప్పటికే అధిక చార్జీలు
నగర మెట్రోలో ఇప్పటికే చార్జీలు ఎక్కువగా ఉన్నాయని ఫిర్యాదులు ఉన్నాయి. పైగా మెట్రో బోగీల్లో విపరీతమైన రద్దీ కూడా ఉంటోంది. రద్దీలో తోసుకుంటూ ఎక్కడం, దిగడం, లోపల నిలబడి ప్రయాణం మామూలే. దీంతో వృద్ధులు, మహిళలు మెట్రోలో చాలా కష్టంగా ప్రయాణించాల్సి వస్తోందనే విమర్శలున్నాయి. రైళ్లలో వసతులను పెంచి, ఆపై చార్జీల గురించి ఆలోచించాలని పలువురు డిమాండ్ చేశారు.
స్థలం ఇప్పిస్తామని
రూ.30 లక్షలు స్వాహా
మైసూరు: మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార (ముడా) నుంచి ఇంటి స్థలం ఇప్పిస్తానని ఓ మహిళకు ఆశ పెట్టి రూ.30 లక్షలు తీసుకుని మోసగించిన ఘటన ఆలనహళ్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. తమకు ముడాలో అధికారులు తెలుసని, తక్కువ ధరకే స్థలం ఇప్పిస్తామని ఆశ పెట్టి నమ్మించి లలితాద్రిపురకు చెందిన మనీషా అనే మహిళ వద్ద నుంచి ఆలనహళ్లికి చెందిన పవిత్ర, విశ్వనాథ్‌శెట్టి రూ.30 లక్షలు తీసుకున్నారు. ఏడాది గడిచినా స్థలం ఊసే లేదు. ఇచ్చిన డబ్బులు వాపసు ఇవ్వాలని వారిని ఒత్తిడి చేసింది. డబ్బులిస్తామని ఇంటికి పిలిపించుకున్న పవిత్ర, భర్త విశ్వనాథ్‌శెట్టి, వారి కొడుకు కలిసి మనీషాపై దాడి చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై ఆలనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
మైక్రో ఫైనాన్స్ సిబ్బంది అరెస్టులు
మైసూరు: రుణ గ్రహీతలను వేధింపులకు గురి చేస్తున్న ఆరోపణలపై ఐదు మైక్రో ఫైనాన్స్ సంస్థలపై కేసులు నమోదు చేసిన నంజనగూడు పోలీసులు ఆయా కంపెనీల నలుగురు రుణ వసూలుదారులను అరెస్టు చేశారు. బీఎస్‌ఎస్ కంపెనీ, అరసనకెరె ఆకాష్, గ్రామీణ కూటకు చెందిన సిద్దరాజు హుణసళ్లి, ఉజ్జీవన్ ఫైనాన్స్‌కు చెందిన లోకేష్, ఐడీఎఫ్‌ఎస్ కంపెనీకి చెందిన కోటె సిద్దరాజులను కోర్టులో హాజరుపరిచి 14 రోజుల రిమాండుకు తరలించారు. ఫైనాన్స్ సిబ్బంది వేధింపులతో ఇటీవల నంజనగూడు తాలూకాలో ఒకే రోజు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.
మైక్రో ఫైనాన్స్‌లపై ఆర్డినెన్స్: హోం మంత్రి
శివాజీనగర: రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్ వేధింపుల వల్ల సామాన్యులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఫైనాన్స్ సిబ్బంది వేధింపులను అరికట్టేందుకు ఆర్డినెన్స్ తేవడానికి నిర్ణయించినట్లు హోం మంత్రి జీ.పరమేశ్వర్ తెలిపారు. బుధవారం బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన, ఇప్పటికే అన్ని జిల్లాధికారులకు, ఎస్పీలకు మైక్రో ఫైనాన్స్ వేధింపుల అడ్డుకట్టపై ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండగా జిల్లాధికారులకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఇచ్చే విషయాన్ని యోచిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఆర్డినెన్స్‌ను జారీ చేయనున్నట్లు తెలిపారు. ఆ ముసాదాను తయారు చేసేందుకు త్వరలో సమావేశాన్ని జరిపి, ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపుతామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment