మహిళను చెట్టుకు కట్టేసి దాడి
రాయచూరు రూరల్: గ్రామస్థులు అమానుషంగా మహిళను చెట్టుకు కట్టేసి చితక బాదిన అనాగరిక సంఘటన వెలుగులోకి వచ్చింది. వ్యక్తి మరణానికి ఈ మహిళే కారణమంటూ దాడి చేశారు. జిల్లాలోని దేవదుర్గ తాలూకా జాళ్ళహళిలో ఈ అఘాయిత్యం చోటు చేసుకుంది. బసవరాజ్ నాయక్ ,దుర్గమ్మ,యంకమ్మ, రేణుక అనేవారు మూకుమ్మడిగా మహిళపై దాడికి దిగారు. బసవరాజ్ నాయక్ అన్న రంగప్ప 20 రోజుల క్రితం మూర్ఛ వ్యాధితో చనిపోయాడు. ఇందుకు ఆ మహిళే కారణమని, ఆమె చేతబడి చేసి ఉంటుందని అనుమానంతో చెట్టుకు కట్టేసి కొట్టారు. జాతర మాదిరిగా వందలాది జనం చూస్తూ ఉండిపోయారు. చివరకు కొందరు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ సుజాత నాయక్ నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఘటన ఫోటోలు, వీడియోలు వ్యాప్తి అయ్యాయి.
చిక్క బీజేపీలో గొడవలు
చిక్కబళ్లాపురం: జిల్లా బీజేపీ అధ్యక్షుని నియామకంపై ఓ వర్గం కార్యకర్తల్లో ఆగ్రహం చెలరేగింది. స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు, పార్టీ నేత సందీప్‌రెడ్డిని జిల్లా బీజేపీ అధ్యక్షునిగా నాయకత్వం నియమించింది. బుధవారం పార్టీ ఆఫీసులో జిల్లా ఇన్చార్జ్ అశ్వథ్‌నారాయణ, రామలింగప్పలతో భేటీ జరిగింది. మాజీ మంత్రి సుధాకర్ మద్దతుదారులు దీనిపై విరుచుకు పడ్డారు. అశ్వథ్‌నారాయణ వెళ్లిపోయిన తరువాత సుధాకర్ మద్దతుదారులు పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బీవై విజయేంద్రకు విరుద్ధంగా నినాదాలు చేశారు. సుధాకర్‌కు తెలియకుండా జిల్లాధ్యక్షున్ని నియమించడం సరికాదని మండిపడ్డారు. సందీప్‌రెడ్డి మద్దతుదారులు కూడా నినాదాలు చేయడంతో గందరగోళం ఏర్పడింది. చివరకు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.
వదిలేసిన కారులో
రూ. కోటి నగదు
యశవంతపుర: ఖాళీ స్థలంలో వదిలి వెళ్లిన కారులో కోటి రూపాయల నగదు బయట పడిన ఘటన ఉత్తరకన్నడ జిల్లా అంకోలా తాలూకా జాతీయ రహదారి 63లో రామనగుళి వద్ద వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం నుంచి గుర్తు తెలియని కారు నిలిపి ఉంది. అనుమానం పడిన స్థానికులు అంకోలా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకుని పరిశీలించారు. బెంగళూరు రిజిస్ట్రేషన్ నంబర్ గల హుండై క్రెటా కారులో కోటి రూపాయిల నగదు లభించింది. కారును, నగదును సీజ్ చేశారు. కారు ఎవరిది, నగదుతో పాటు ఎందుకు వదిలేశారు అనేది సస్పెన్స్‌గా మారింది. కారు నంబరు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.
బీదర్ జిల్లాలో
ఇద్దరు రైతుల ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: బీదర్ జిల్లాలో ఒకే రోజు ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. బాల్కి తాలూకా ఖానాపురకు చెందిన కార్తీక్ (21), బసవకల్యాణ తాలూకా ఇల్లాళ గ్రామం నివాసి జగదీశ్ రెడ్డి ప్రహ్లాద్ రెడ్డి (49) మృతులు. వివరాలు... కార్తీక్ కొంత పొలాన్ని గుత్తకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. ఇందుకోసం బ్యాంకు నుంచి రూ.4 లక్షలు అప్పు చేశాడు. అయితే వ్యవసాయంలో నష్టం రావడంతో ఖానాపుర వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జగదీశ్ రెడ్డి బ్యాంకులో రూ.1.25 లక్షలు రుణం తీసుకున్నాడు. అయితే వ్యవసాయంలో తరచూ నష్టాలే రావడంతో విరక్తి చెంది బావిలోకి దూకి ప్రాణాలు తీసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment