ప్రజాపాలనే అందరి ఆకాంక్ష : మంత్రి పొంగులేటి | - | Sakshi
Sakshi News home page

ప్రజాపాలనే అందరి ఆకాంక్ష : మంత్రి పొంగులేటి

Jan 11 2024 8:36 AM | Updated on Jan 11 2024 12:16 PM

 ఏదులాపురంలో హెల్త్‌ సబ్‌సెంటర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాసరెడ్డి - Sakshi

ఏదులాపురంలో హెల్త్‌ సబ్‌సెంటర్‌ను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాసరెడ్డి

ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం ఏర్పడాలని అన్నివర్గాల వారు ఆకాక్షించినట్లుగానే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఖమ్మం రూరల్‌ మండలంలోని ఏదులాపురం, కొండాపురంలో ఆరోగ్య ఉప కేంద్రాలను మంత్రి బుధవారం ప్రారంభించారు.

ఈసందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన సభల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను తప్పక అమలు చేస్తామని, ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు. ప్రజాపాలన ద్వారా అధికారులు ప్రజల వద్దకే వచ్చి దరఖాస్తులు తీసుకున్నారని, ఇందులో అర్హులందరికీ పథకాలు అందిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం మాదిరి అప్పులను చూపి హామీలను విస్మరించాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

ఎన్ని అవాంతరాలు, కష్టాలు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని పేర్కొన్నారు. ఆతర్వాత ఆరెంపులకు చెందిన మాజీ ఎంపీటీసీ కొండల్‌ కుటుంబాన్ని పరామర్శించగా, కొండాపురంలో ఉపసర్పంచ్‌ బెల్లం కృష్ణయ్య, మట్టా వీరభద్రం, గడ్డం శ్రీను తదితరులు కాంగ్రెస్‌లో చేరగా వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే, కాచిరాజుగూడెంకు చెందిన పొన్నం వెంకయ్య తన భూమిని ఇతరులు ఆక్రమించుకోగా పోలీసులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేయగా వెంటనే న్యాయం చేయాలని ఆదేశించారు.

ఈకార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ మాలతి, ఎంపీడీఓ రవీందర్‌రెడ్డి, తహసీల్దార్‌ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇక కూసుమంచి మండలం పాలేరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి గృహప్రవేశం చేసిన మంత్రి పొంగులేటి ఆధ్వర్యాన జరిగిన సభకు మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎంపీపీలు బోడ మంగీలాల్‌, వజ్జా రమ్య, నాయకులు రాయల నాగేశ్వరరావు, తుంబూరు దయాకర్‌రెడ్డి, మద్ది శ్రీనివా స్‌రెడ్డి, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, విజయాబాయి, సాదు రమేష్‌రెడ్డి, రాంరెడ్డి చరణ్‌రెడ్డి, రామసహాయం వెంకటరెడ్డి, రామసహాయం నరేష్‌రెడ్డి, జూకూరి గోపాలరావు, మట్టె గురవయ్య, కళ్లెం వెంకటరెడ్డి పాల్గొన్నారు.

ఇవి చ‌ద‌వండి: TS MLC: ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement