విద్యుత్‌ శాఖకు రూ.20 లక్షల నష్టం | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ శాఖకు రూ.20 లక్షల నష్టం

Published Tue, May 7 2024 4:25 AM

విద్యుత్‌ శాఖకు రూ.20 లక్షల నష్టం

● గాలివానకు విరిగిన స్తంభాలు, కూలిన ట్రాన్స్‌ఫార్మర్లు ● పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమైన ఉద్యోగులు

ఖమ్మంవ్యవసాయం: ప్రకృతి వైపరీత్యంతో జిల్లాలో విద్యుత్‌ శాఖకు రూ.20 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఆ శాఖ అధికారులు గుర్తించారు. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో అకాల వర్షం కురవగా.. పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. అలాగే, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలడంతో పాటు విద్యుత్‌ లైన్లు తెగిపోయాయి. ఇక పందిళ్లపల్లి, ధంసులాపురం మధ్య 33 కేవీ టవర్లు ధ్వంసం కావడంతో సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు 205 స్తంభాలు కూలిపోగా, 13 డీటీఆర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో సంస్థకు రూ.20 లక్షల నష్టం వాటిల్లిందని అధికారులు తేల్చారు. సోమవారం నాటికి ఇందులో పలు స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లను సరిచేసి సరఫరా పునరుద్ధరించారు. ఖమ్మం ఎస్‌ఈ ఏ.సురేందర్‌ పర్యవేక్షణలో ఉద్యోగులు యుద్ధప్రాతిపాదికన మరమ్మతులు చేస్తున్నారు.

కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

విద్యుత్‌ సమస్యలు తెలుసుకునేందుకు జిల్లా కేంద్రంలో కంట్రోల్‌ రూం ఏర్పాటుచేసినట్లు ఎస్‌ఈ తెలిపారు. వైర్లు తెగిపడినా, సమస్య తలెత్తినా సమస్యల 94408 11525 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.

పంట నష్టంపై నివేదిక ఇవ్వండి

ప్రకృతి వైపరీత్యంతో జరిగిన పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించారు. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో జిల్లాలో కోత దశలో ఉన్న మామిడి, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పలుచోట్ల వరి, మొక్కజొన్న పంటలు కూడా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యాన నష్టంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించగా ఇప్పటికే ప్రాథమిక నివేదిక రూపొందించిన అధికారులు మంగళవారం నుంచి సర్వే చేయాలని నిర్ణయించారు.

Advertisement
 
Advertisement