వడగండ్ల వాన | Sakshi
Sakshi News home page

వడగండ్ల వాన

Published Wed, May 8 2024 12:40 AM

వడగండ

కన్నుమూస్తివా బసవా.. కాడి మోసేదెవరురా

ఆసిఫాబాద్‌/ఆసిఫాబాద్‌రూరల్‌/కౌటాల/పెంచికల్‌పేట్‌/దహెగాం/చింతలమానెపల్లి/రెబ్బెన: జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రంతో పాటు కాగజ్‌నగర్‌, కెరమెరి, దహెగాం, కౌటాల, పెంచికల్‌పేట్‌, లింగాపూర్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న ప్రజలు ఎట్టకేలకు కురిసిన వర్షంతో వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రెండు గంటల పాటు కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. వర్షపు నీటితో డ్రైయినేజీలు నిండిపోవడంతో రోడ్లపై నీరు ప్రవహించింది. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన టేలాలు, దుకాణాల సముదాయాల్లో వర్షపు నీరు చొరబడడంతో ఇబ్బందులకు గురయ్యారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. రెబ్బెన మండలం కై రిగూడ పంచాయతీ పరిధిలోని గొల్లగూడలో విద్యుత్‌ స్తంభంతో పాటు మినీ ట్రాన్స్‌ఫార్మర్‌ కిందపడి దెబ్బతిన్నాయి. పలు మండలాల్లో రైతులు సాగు చేసుకున్న మొక్కజొన్న, జొన్న, వరిపంటలు నేలవాలడంతో రైతులకు నష్టం వాటిల్లింది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం కాపాడుకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులకు గురయ్యారు.

పిడుగు పాటుకు ఎద్దు మృతి

కన్నీటి పర్యంతమైన రైతు కుటుంబం

కౌటాల: ఖరీఫ్‌ సీజన్‌ సమీపిస్తున్న వేళ కాడెద్దు మృతి చెందడంతో ఆ రైతు కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. అలుపెరగకుండా అరక నడిచే తమ బసవడు అనుకోని ఘటనతో బలికావడంతో ‘కన్నుమూస్తివా బసవా.. కాడి మోసేదెవరురా’ అంటూ ఆ రైతు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం కౌటాల మండలంలోని నాగేపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు మోర్లె దస్రు గతేడాది రూ.1.20 లక్షలు అప్పుచేసి రెండు ఎద్దులు కొనుగోలు చేశాడు. మంగళవారం ఉదయమే గ్రామ శివారులో మేతకు వదిలాడు. ఎద్దులు మేత మేస్తుండగా మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి ఓ ఎద్దుపై పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఒకే ఎద్దుతో వ్యవసాయం చేసేది ఎలా అని రైతు కుటుంబం ఆవేదన చెందుతోంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది.

నేలకొరిగిన పంటలు

స్తంభించిన జనజీవనం

వడగండ్ల వాన
1/3

వడగండ్ల వాన

వడగండ్ల వాన
2/3

వడగండ్ల వాన

వడగండ్ల వాన
3/3

వడగండ్ల వాన

 
Advertisement
 
Advertisement