కృష్ణా :అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న మొగుడే భార్యను కడతేర్చి కాలయముడయ్యాడు. మండలంలోని కుమ్మమూరు ఎస్సీ కాలనీలో శనివారం సాయంత్రం వీర్ల రమ్యతేజ (32) దారుణహత్యకు గురయింది. భర్త రామకృష్ణ సెల్‌ఫోన్ చార్జింగ్ వైరుతో రమ్యతేజను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. కుమ్మమూరు గ్రామానికి చెందిన వీర్ల రామకృష్ణ అదే గ్రామానికి చెందిన రమ్యతేజ ప్రేమించుకుని గత 11 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. గతంలో రామకృష్ణ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ ఉండేవాడని, ప్రస్తుతం స్థానికంగానే కూలీ పనులకు వెళుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
రమ్యతేజ డ్వాక్రా గ్రూపుల తరపున వీఓఏగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో భార్య రమ్యతేజపై గత కొంతకాలంగా భర్త రామకృష్ణ అనుమానం పెంచుకున్నాడు. ఏడాది కాలంగా ఇద్దరి మద్య గొడవలు ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిసింది. నెల క్రితం అత్త జయలక్ష్మిపై కూడా రామకృష్ణ దాడికి పాల్పడి తల పగులగొట్టినట్లు సమాచారం. రమ్యతేజ గత ఇరవై రోజుల క్రితం గ్రామంలోని పుట్టింటికి వెళ్లింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో భర్త రామకృష్ణ వద్దకు వచ్చింది. సాయంత్రం 5 గంటలకు రమ్యతేజ హత్యకు గురయ్యిందనే సమాచారం గ్రామంలో కలకలం రేపింది.
టబ్‌చైర్‌లో విగతజీవిగా పడిఉన్న కూతురిని చూసి తల్లి జయలక్ష్మి, కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున ఘటనా ప్రాంతానికి తరలివచ్చారు. మృతురాలు రమ్యతేజకు ఇద్దరు కుమార్తెలు ఖ్యాతి (9), రిషిత (7) ఉన్నారు. వీరు ఉయ్యూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటున్నారు. రమ్యతేజ మృతదేహాన్ని పమిడిముక్కల సీఐ చలపతిరావు, ఎస్‌ఐ రమేష్ సందర్శించి పరిశీలించారు. మృతురాలి తండ్రి మెల్లంపల్లి కోటేశ్వరరావు ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్ తెలిపారు. భార్య రమ్యతేజను హత్య చేసిన అనంతరం భర్త రామకృష్ణ పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment