ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయాలి | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయాలి

Published Fri, May 17 2024 8:50 AM

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయాలి

గాంధీనగర్‌(విజయవాడ సెంట్రల్‌): ఓట్ల లెక్కింపునకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎన్టీఆర్‌ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు ఆదేశించారు. జూన్‌ నాలుగో తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై కలెక్టరేట్‌ ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ రూమ్‌లో అధికారులతో ఆయన గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. సమష్టి కృషితో జిల్లాలో పోలింగ్‌ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించామని, ఇదే స్ఫూర్తిని లెక్కింపు ప్రక్రియలోను కొనసాగించి విజయవంతం చేయాలని సూచించారు. ఇబ్రహీంపట్నం జూపూడిలోని నోవా, నిమ్రా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో స్ట్రాంగ్‌ రూముల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో పటిష్టమైన మూడు అంచెల భద్రత ఉందన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూమ్‌లు, సీల్‌ వేసిన డోర్‌లు, సెక్యూరిటీ, కారిడార్లను కవర్‌ చేసేలా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేసిన సీసీ కెమెరాలు, భద్రత పర్యవేక్షణపై నియమించిన గెజిటెడ్‌ అధికారులు, పోలీసు అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గుర్తింపు కార్డులు లేని వ్యక్తులు, అనధికార వ్యక్తులు, ఇతరుల వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దని స్పష్టంచేశారు. స్ట్రాంగ్‌ రూముల వద్ద ఓట్ల లెక్కింపు కేంద్రాలకు పోలింగ్‌ యంత్రాలు తరలించే మార్గాలు, అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లడానికి వేరు వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళికతో అధికారులు పనిచేయాలని సూచనలు చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు. లెక్కింపు కేంద్రంలో అసెంబ్లీకి, పార్లమెంటుకు ఒక్కొక్క దానికి 14 టేబుల్స్‌ చొప్పున 28 టేబుళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ప్రక్రియ చేపట్టాకే ఈవీఎంల కౌంటింగ్‌ ప్రారంభించాలన్నారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకరాలను పాటిస్తూ కచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో వి.శ్రీనివాసరావు, కలెక్టరేట్‌ ఏఓ నాగ లక్ష్మి, ఎలక్షన్‌ సెల్‌ సూపరింటెండెంట్‌ ఎం.దుర్గా ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఢిల్లీరావు

Advertisement
 
Advertisement
 
Advertisement