
కర్నూలు సిటీ: పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది నందికొట్కూరు, కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లె హైస్కూళ్లలో జరిగిన ఘటనల దృష్ట్యా ఈ ఏడాది ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలను నో సెల్‌ఫోన్ జోన్లుగా ప్రకటించారు. కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను నిషేధించారు. అదే విధంగా ప్రశ్నపత్రంలో ఏడు అంకెల ప్రత్యేక కోడ్‌ను ముద్రించారు.
ఎక్కడైన ప్రశ్నపత్రం లీకేజీ అయినా.. ఆ పేపర్‌పై ఉన్న ఏడు అంకెల కోడ్‌ను బట్టి సులువుగా ఏ సెంటర్ నుంచి ప్రశ్నపత్రం బయటకు వచ్చిందో స్పష్టంగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. పరీక్ష కేంద్రాలను ఇప్పటికే విద్యాశాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. గదుల్లో లైటింగ్ ఉండేలా, ఫ్యాన్లు తిరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మన బడి నాడు–నేడు కింద రెండో విడతలో చేపట్టిన పనులు పూర్తి చేసేలా సమగ్ర శిక్ష విభాగం, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పని చేస్తున్నారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాల దగ్గర అదనపు పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు.
149 కేంద్రాల్లో పరీక్షలు
వచ్చే నెల 3వ తేదీ నుంచి మొదలు కానున్న పదో తరగతి పరీక్షలకు జిల్లాలో 149 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఏ సెంటర్లు (పోలీసు స్టేషన్లకు దగ్గర ఉండేవి) 79, బీ సెంటర్లు(పోలీసు స్టేషన్లకు 8 కి.మీ. లోపు ఉండేవి)56, సీ సెంటర్లు (పోలీసు స్టేషన్లకు 8 కి.మీ.కు పైగా ఉన్నవి)14 ఉన్నాయి. ఈ కేంద్రాలలో 490 ఉన్నత పాఠశాలలకు చెందిన 32,780 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల విధులు నిర్వహించేందుకు 149 మంది ముఖ్య పర్యవేక్షకులను, 149 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లను, 1,664 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. 11 సమస్యాత్మమైక, 9 అత్యంత సమస్యాత్మకమైన పరీక్ష కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్ ఉండనున్నారు. అలాగే 7 ప్లయింగ్ స్క్వాడ్ టీమ్‌లు పనిచేయనున్నాయి.
జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలి
పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని 149 పరీక్ష కేంద్రాలను నో సెల్‌ఫోన్ జోన్లుగా ప్రకటించాం. నాతో సహా ఏ స్థాయి అధికారి అయినా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు తీసుకపోకూడదు. కేంద్రాలుగా ఏర్పాటు చేసిన ప్రాంతాలను హై సెక్యూరిటీ జోన్లుగా ప్రకటించారు. ఏ చిన్న తప్పు జరిగినా సంబంధిత కేంద్రా ల్లో విధులు నిర్వహించే వారే బాధ్యులు అవుతారు. జాగ్రత్తగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
– డాక్టర్ వెంకట రంగారెడ్డి, డీఈఓ
నేడు, రేపు జిల్లాకు ప్రశ్నపత్రాలు
పదో తరగతి ప్రశ్నపత్రాలు నేడు, రేపు జిల్లాకు రానున్నాయి. నేడు(గురువారం) మొదటగా సెట్–1, రేపు(శుక్రవారం)రెండో సెట్ ప్రశ్నపత్రాలు రానున్నాయి. వీటిని జిల్లాలో ఎంపిక చేసిన 38 స్టోరేజీ పాయింట్లకు చేర్చి అక్కడ భద్రపరచనున్నారు. ఇందుకు ఇప్పటికే 11 రూట్లకు ఆఫీసర్లను సైతం ఎంపిక చేశారు.
Comments
Please login to add a commentAdd a comment