కమీషన్ ఏజెంట్ల అడ్డగోలు దోపిడీ
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో కమీషన్ ఏజెంట్లు దోపీడీకి పాల్పడుతున్నారు. యార్డులో దాదాపు 80 శాతం ఏజెంట్లు రైతులను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. మార్కెట్ కమిటీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కమీషన్ ఏజెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ నెల 23వ తేదీన డోన్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ అనే రైతు 30 బ్యాగుల వేరుశనగను యార్డులోని ఈ.రమేష్‌గౌడుకు చెందిన మల్లికార్జున ట్రేడర్స్‌కు తెచ్చారు. ధర క్వింటాలుకు రూ.5,379.89 లభించింది. వేరుశనగకు వచ్చిన మొత్తం రూ.87,100. తక్‌పట్టీలో లెక్కల ప్రకారం హమాలీ, లేబర్ చార్టీలతో పాటు కమీషన్ ఏజెంటు కమీషన్ రూ.2331.27 మినహాయించుకొని రైతుకు రూ.84,769.15 చెల్లించాల్సి ఉంది. కమీషన్ ఏజెంటు అసోషియేషన్‌కు, కార్మిక సంఘాల పేరుతో తక్‌పట్టీలో వచ్చిన మొత్తానికి అదనంగా రూ.780 కోత పెట్టడంతో రైతు తిరుగబడ్డాడు. ‘కమీషన్ ఏజెంట్ల సంఘంతో మాకేమి సంబంధం’ అంటూ ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తే తగ్గించి చివరికి రూ.369 అదనంగా వసూలు చేశారు. సాధారణంగా పంట ఉత్పత్తులను విక్రయించిన ప్రతి రైతుకు ఈ–నామ్‌లో జనరేట్ అయిన తక్‌పట్టీ ఇవ్వాల్సి ఉంది. తక్‌పట్టీలో రైతు తెచ్చిన పంటకు సంబంధించి సమగ్ర సమాచారం ఉంటుంది. హమాలీ చార్జీలు, ఏజెంటు కమీషన్ పోనూ రైతుకు ఎంత చెల్లించాలనే వివరాలు ఉంటాయి. కాని పలువురు కమీషన్ ఏజెంట్లు తక్‌పట్టీలో వచ్చిన వాటికి విరుద్ధంగా రైతుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు. కమీషన్ ఏజెంట్లు సంఘం, లేబర్ సంఘాల పేరుతో అడ్డుగోలుగా వసూలు చేస్తుండటం గమనార్హం. కొందరు రైతులు ఎందుకు కట్టాలని ప్రశ్నిస్తున్నా.. బైలాలోనే ఉందని బురిడీ కొట్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తక్‌పట్టీ కాదని అదనంగా వసూళ్లు
Comments
Please login to add a commentAdd a comment