తూతూ మంత్రంగా ఓటరు ప్రత్యేక క్యాంపులు
కర్నూలు(సెంట్రల్): స్పెషల్ సమ్మరీ రివిజన్–2025కు సంబంధించిప్రత్యేక ఓటరు క్యాంపులను ఎన్నికల అధికారులు తూతూమంత్రంగా నిర్వహించారు. పాణ్యం, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరులో ఓటరు నమోదు కోసం ఒక్క ఫారం–6 దరఖాస్తును స్వీకరించలేదంటే అధికారులు ఏ మాత్రం పని చేసి ఉంటారో తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల్లో ఫారం 6, 7, 8లు కలిపి మొత్తం 1,344 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 2,203 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులను నిర్వహించగా ఫారం–6 కింద 452, ఫారం–7 కింద 196, ఫారం–8 కింద 493 మొత్తం 1,344 దరఖాస్తులను మాత్రమే అధికారులు స్వీకరించారు. స్థానికంగా సరైన ప్రచారం లేకపోవడంతో ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, కొత్త దరఖాస్తులు పెద్దగా రాలేదు.
టమాట ధర ౖపైపెకి!
కర్నూలు(అగ్రికల్చర్): టమాట ధరకు రెక్కలు వస్తున్నాయి. రబీలో టమాట సాగు తగ్గిపోవడం, వచ్చిన టమాట దిగుబడులు ఇతర ప్రాంతాలకు తరలుతుండటంతో మార్కెట్‌లో కొరత ఏర్పడుతోంది. దీంతో ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కర్నూలు రైతు బజారులో కిలో ధర రూ.30 ఉండగా.. బయట కిలో రూ.50 ఆపైన ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ధర మరింత ఎక్కువగా ఉంది. రబీలో టమాట సాధారణ సాగు 511 హెక్టార్లు ఉండగా.. కేవలం 136 హెక్టార్లలో మాత్రమే సాగు అయింది. టమాటతో సహా కూరగాయల సాగుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు లేకపోవడంతో సాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. దీంతో సాగు తగ్గింది. డిమాండ్ పెరిగింది. ఆదివారం పత్తికొండ మార్కెట్‌కు కేవలం 37 టన్నులు మాత్రమే వచ్చింది. ఒక దశలో ఈ మార్కెట్‌కు 80 టన్నులకు పైగా వచ్చింది. సగానికి పైగా తగ్గడంతో ఈ ప్రభావం ధరలపై పడుతోంది. క్వింటాకు కనిష్ట ధర రూ.2,000, గరిష్ట ధర రూ.3,200 లభించింది.సగటు ధర రూ.2,500 నమోదు అయింది. రానున్న రోజుల్లో టమాట ధర మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
హంద్రీనీవా నుంచి
జీడీపీకి నీటి విడుదల
కర్నూలు సిటీ: హంద్రీనదిపై నిర్మించిన గాజులదిన్నె ప్రాజెక్టు (దామోదం సంజీవయ్య సాగర్)లో నీటి నిల్వలలు తగ్గిపోతుండడంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా హంద్రీనీవా కాలువ నుంచి ఆదివారం నీటిని విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్‌కు నీటి లభ్యత లేక కేవలం తాగు నీటి అవసరాలు తీర్చే సమ్మర్ స్టోరేజీ ట్యాంకులా మారింది. దీంతో హంద్రీనీవా కాలువ ఏర్పాటైన తర్వాత 11.40 కి.మీ దగ్గర అదనపు స్లూయిజ్ ఏర్పాటు చేసి సంవత్సరంలో కాల్వలో ఎన్ని రోజులు నీటి ప్రవాహం ఉంటే అన్ని రోజుల పాటు 3 టీఎంసీల నీటిని ఇచ్చేలా గతంలో కేటాయింపులు చేశారు. అయితే రోజుకు 230 క్యూసెక్కులకు పైగా నీటిని స్లూయిజ్ నుంచి విడుదల చేయాలి. కేవలం 100 క్యుసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. ఇలా అయితే 3 టీఎంసీల నీరు వచ్చేందుకు ఎన్ని రోజులు పడుతుందని ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు.
రేపు సాగు నీటి సలహా
మండలి సమావేశం
కర్నూలు సిటీ: జిల్లాలో సాగు నీటి జలాశయాల్లో నీటి నిల్వను బట్టి రబీ సీజన్‌లో సాగు చేసే ఆయకట్టుకు నీటి విడుదలపై చర్చించేందుకు ఈ నెల 26వ తేదీ (మంగళవారం) సాగు నీటి సలహా మండలి సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, జల వనరుల శాఖ ఇంజినీర్లు తదితరులు హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment