ఆరు నెలల వ్యవధిలోనే ఉమ్మడి జిల్లాలో 45 మంది రైతుల బలవన
● మళ్లీ 2014 –19 నాటి పరిస్థితులు
ఉత్పన్నం
● ఈ ఏడాది కలిసి రాని వ్యవసాయం
● దక్కని పెట్టుబడులు..
ఆదుకోని ప్రభుత్వం
● అప్పుల బాధతో
ప్రాణాలు తీసుకుంటున్న రైతన్నలు
● బాధిత కుటుంబాలకు
అందని పరిహారం
● వైఎస్సార్‌సీపీ హయాంలో
సత్వరం చేయూత
కర్నూలు(అగ్రికల్చర్): 2014 నుంచి 2019 వరకు కొనసాగిన రైతుల బలవన్మరణాల పరంపర మళ్లీ మొదలైంది. నాటి టీడీపీ పాలనలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 321 మంది కర్షకులు ఆత్మహత్యాలకు పాల్పడ్డారు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీంతో 2019 ఎన్నికల్లో రైతులు చంద్రబాబును నమ్మలేదు. 2024 ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆయన కొత్త పల్లవి ఎంచుకున్నారు. ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు సాయం అందిస్తామని ప్రకటించారు. సూపర్–6 హామీల్లో దీనిని చేర్చి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. రైతులు, ఇతర అన్ని వర్గాల ప్రజలు మరోసారి నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. బాబు నేతృత్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతోంది. ఇప్పటి వరకు రైతుల సంక్షేమానికి తీసుకున్న చర్యలు శూన్యం. ఖరీఫ్ సీజన్ దాటిపోయి రబీ సీజన్ వచ్చినా పెట్టుబడి సాయం అందించలేదు. దీనికితోడు ఈసారి పంటలు సరిగ్గా పండలేదు. ఫలితంగా రైతులు అప్పుల ఊబీలో కూరుకుపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
ఆరు నెలల్లోనే
45 మంది రైతులు ఆత్మహత్య
ఈ ఏడాది జూన్ నెలలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ స్వల్ప వ్యవధిలోనే ఉమ్మడి జిల్లాలో 45 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. కర్నూలు జిల్లాలో 27, నంద్యాల జిల్లాలో 18 మంది ప్రాణాలు తీసుకున్నారు. 2024–25లో వ్యవసాయం కలసి రాలేదు. ఒకవైపు వర్షాభావం, మరోవైపు అధిక వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా పత్తి, వేరుశనగ, ఆముదం, మొక్కజొన్న తదితర పంటల్లో అధిక వర్షాలు, వర్షాభావం వల్ల దిగుబడులు పడిపోయాయి. అంతంత మాత్రం వచ్చిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. మార్కెట్‌లో ధరలు పడిపోయినప్పటికీ కనీసం మద్దతు ధరతోనైనా అమ్ముకునే అవకాశం కూడా లేకుండా పోయింది. మరోవైపు కరువు మండలాలను గుర్తించడంలో ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం వహించింది. కేవలం పెద్దకడబూరు, కౌతాళంను కరువు మండలాలుగా గుర్తించి, మిగిలిన మండలాలను గాలికి వదిలేసింది. నంద్యాల జిల్లాలోని డోన్ నియోజక వర్గం పూర్తిగా వర్షాధారంపై మాత్రమే ఆధారపడింది. నంద్యాల జిల్లాలో ఒక్క మండలాన్ని కూడా కరువు ప్రాంతంగా గుర్తించలేదు. ఇలా ప్రభుత్వ సాయం లేక.. వ్యవసాయం కలసిరాక రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
బాధిత కుంటుబాలకు కరువైన చేయూత
బలవన్మరణాలకు పాల్పడిన రైతు కుటుంబాలకు చేయూత కరువైంది. రైతులు ఆత్మహత్యలకు పాల్పడినప్పుడు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ అవుతుంది. దీనిపై మండల వ్యవసాయ అధికారి విచారణ జరిిపి ప్రాథమిక రిపోర్టును జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయానికి పంపుతున్నారు. ఇప్పటి వరకు 45 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు మండల స్థాయి కమిటీ అధికారులైన సబ్ ఇన్‌స్పెక్టర్, తహసీల్దారు, వ్యవసాయ అధికారి ధ్రువీకరిస్తూ ప్రాథమిక రిపోర్టులు పంపినట్లు స్పష్టమవుతోంది. దీనిపై త్రీమెన్ కమిటీ విచారణ జరపాలి. ఈ కమిటీలో ఏడీఏ, ఆర్‌డీఓ, డీఎస్‌పీలు ఉంటారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడినప్పటికీ జిల్లాలో త్రీమెన్ కమిటీల జాడే లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు రైతుల ఆత్మహత్యలకు సంబంధించిన యాప్ ఓపన్ కాలేదు. త్రీమెన్ కమిటీ విచారణకు సంబంధించిన అంశాలు, డాక్యుమెంట్లను అందులో అప్‌లోడ్ చేయాలి. ఇంత వరకు యాప్ ఇవ్వకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలకు చేయూత దక్కేది అనుమానంగా మారింది.
సాయం కోసం ఎదురు చూపు...
ఇక్కడ మహిళా రైతు సువర్ణ చిత్ర పటం చూపుతున్న కుటుంబానిది కృష్ణగిరి మండలం, పందిర్లపల్లె గ్రామం. పేద కుటుంబం. నాలుగున్నర ఎకరాల భూమి ఉంది. ఇందులో ఈ ఏడాది వేరుశనగ, ఆముదం పంటలు సాగు చేశారు. కాలం కలిసిరాకపోవడంతో పంటలు పండలేదు. పెట్టుబడులకు రూ.8 లక్షల వరకు అప్పులు చేశారు. దీనిని ఎలా తీర్చాలని భర్త పాండుతో కలిసి సువర్ణ మదన పడేది. ఇంట్లో ఉన్నా, పొలానికి వెళ్లినా వారిద్దరి మధ్య ఇదే అలోచన. చివరకు దిక్కుతోచక సువర్ణ ఆగస్టు నెలలో పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మండల స్థాయి అధికారుల ప్రాథమిక విచారణలో మహిళా రైతు ఆత్మహత్యగా నిర్ధారించినప్పటికీ ప్రభుత్వం నుంచి చేయూత కరువైంది.
వైఎస్సార్‌సీపీ హయాంలో సత్వరమే సాయం
2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు చెల్లించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచింది. మరణించిన రైతు నామినీ బ్యాంకు ఖాతాకు నేరుగా పరిహారాన్ని జమ చేసింది. త్రీమెన్ కమిటీ రిపోర్టు అందిన నెల రోజుల్లోపే పరిహారం విడుదల అయ్యేది. ఇది రైతు కుటుంబాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపింది. 2014– 2019 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించలేదు. అప్పట్లో ఉమ్మడి జిల్లాలో 180 మంది రైతుల బలవన్మరణాలను త్రీమెన్ కమిటీ నిర్ధారించినప్పటికీ పరిహారం ఇవ్వడానికి బాబు సర్కారుకు మనసొప్పలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఆ 180 రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ప్రకారం రూ.9 కోట్లు పరిహారం పంపిణీ చేసి ఆదుకుంది.
Comments
Please login to add a commentAdd a comment