అందని ‘భరోసా’..
పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులు
● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 13,23,813 మంది అర్హులు
● ఇప్పటివరకు భరోసా ఇచ్చింది57,914 మందికే
● మండలానికి ఒక్క గ్రామం రైతులకే సొమ్ము జమ చేసిన ప్రభుత్వం
● మిగతా వారికి ఎప్పుడన్నదానిపై స్పష్టత కరువు
సాక్షి, నాగర్‌కర్నూల్: ప్రభుత్వం రైతుభరోసా కింద రైతులకు అందిస్తున్న పెట్టుబడి సాయం కొందరికే అందింది. మండలానికి ఒక్క గ్రామం చొప్పున ఎంపిక చేసి ఆ గ్రామంలోని రైతులకే ప్రభుత్వం భరో సా కింద ఆర్థికసాయాన్ని అందజేసింది. ఇంకా సా యం అందాల్సిన వారు పెద్దసంఖ్యలో ఉండటంతో తమ వంతు ఎప్పుడు వస్తుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పథకం కింద అర్హులైన రైతులందరికీ ఎప్పటి నుంచి ప్రభుత్వ సాయం అందుతుందన్న దానిపై స్పష్టత కరువైంది.
5 శాతం లోపు రైతులకే..
రైతు భరోసా పథకం కింద ఈసారి ప్రభుత్వం ఒక్కో ఎకరాకు తొలి విడతలో రూ.6 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తోంది. ఈ నెల 26న రైతుభరోసా పథకాన్ని ప్రారంభించినా, ఆ రోజున బ్యాంకులకు సెలవు కావడంతో 27న ఉదయం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమైంది. అర్హులైన రైతులందరికీ ఒకేసారి కాకుండా, మండలానికి ఒక గ్రామం చొప్పున అధికారులు ఎంపిక చేసిన గ్రామాల్లోని రైతుల ఖాతాల్లో మాత్రమే ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని జమ చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 13,23,813 మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా తేలగా, ఇప్పటి వరకు ప్రభుత్వ సాయాన్ని అందించింది 57,914 మందికే. కేవలం 5శాతం లోపు రైతుల మాత్రమే సాయాన్ని అందుకోగా, ఇంకా పెద్ద సంఖ్యలో రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో వ్యవసాయానికి ఆర్థికసాయాన్ని అందించాలని కోరుతున్నారు.
సాగు లెక్కలపై సా..గుతున్న కసరత్తు..
ఈసారి రైతుభరోసా కింద సాయం అందించేందుకు కేవలం వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే పెట్టుబడి సాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పౌల్ట్రీ, రియల్ ఎస్టేట్ వెంచర్లు, లేఅవుట్లు, ఫిషరీస్, నాలా కన్వర్షన్, కమర్షియల్ తదితర భూములను గుర్తించి ఈ పథకం లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తోంది. అయితే అర్హులైన రైతులందరికీ సాయం అందించేందుకు లబ్ధిదారుల తొలగింపు ప్రక్రియ పూర్తికాక పోవడమే అడ్డంకిగా మారింది. వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించి ఫ్రీజ్ చేస్తేనే మిగతా వారికి ఇచ్చేందుకు మార్గం సుగుమం కానుంది. ఒకే సర్వే నంబరులో ఉన్న వ్యవసాయ భూములు, వ్యవసాయ యోగ్యం కాని భూములను ఫ్రీజ్ చేసే విషయంలో పీటముడి నెలకొంది. ఈ కసరత్తు ఇంకా కొనసాగుతుండటంతో మరో వారం రోజుల తర్వాతే మిగతా రైతులకు ప్రభుత్వ సాయం అందించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment