రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
● ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
ఊట్కూర్: ఆర్టీసీ బస్సు, స్కూటీ ఎదురెదురుగా ఢీకొని ఇర్ఫాన్ (19) మృతి చెందగా, ఇద్దరికి తీవ్రగాయాలయిన ఘటన బుధవారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఊట్కూర్ గ్రామానికి చెందిన ఇర్ఫాన్, షాహబాజ్, షిఫాయతుల్లా అనే ముగ్గురు యువకులు బస్టాండ్ నుంచి చెక్‌పోస్టుకు స్కూటీపై వెళ్తున్నారు. ఊరలక్ష్మమ్మ ఆలయం సమీపంలో ముందుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఒవర్‌టెక్ చేసే క్రమంలో మక్తల్ నుంచి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. దీంతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గుర్తించిన స్థానికులు చికిత్స కోసం క్షతగాత్రులను నారాయణపేట ఆస్పత్రికి తరలించారు. బాధితుల పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇర్ఫాన్, షహబాజ్ పరిస్థితి మరింత విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ఇర్ఫాన్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇర్ఫాన్ బైక్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మృతుడికి తండ్రి ఇస్మాయిల్, తల్లి, ఇద్దరు సోదరులు ఉన్నారు. షిఫాయతుల్లా ఎస్వీఎస్ ఆస్పత్రిలో, షహబాజ్ హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న సీఐ చంద్రశేఖర్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయమై కేసు నమేదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణంరాజు తెలిపారు.
అమరవాయి సమీపంలో..
మల్దకల్: మండలంలోని అమరవాయి స్టేజీ సమీపంలోని స్పీడ్ బ్రేకర్ వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి.. అయిజ పట్టణానికి చెందిన ఈడిగ సరస్వతమ్మ(54) తన మరిది ప్రతాప్‌గౌడ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై గద్వాల నుంచి తిరిగి వస్తుండగా.. అమరవాయి స్టేజీ సమీపంలో ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ వద్ద మోటారు సైకిల్ అదుపుతప్పి కిందపడ్డారు. మోటారు సైకిల్‌పై ఉన్న ఇద్దరు కిందపడటంతో ప్రతాప్‌గౌడ్ స్వల్పగాయాలు కాగా సరస్వతమ్మ తీవ్రంగా గాయపడడంతో చికిత్స నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సరస్వతమ్మ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందగా.. ఆమెకు ముగ్గురు సంతానం ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉరేసుకొని
యువకుడి ఆత్మహత్య
అడ్డాకుల: ఇంట్లో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ ఎం.శ్రీనివాస్ కథనం ప్రకారం.. మండలంలోని నాగాయపల్లి గ్రామానికి చెందిన గద్దెగూడెం చెన్నయ్య(24) గ్రామంలో ఉంటూ తల్లితో కలిసి కూలీ పనులు చేసేవాడు. మంగళవారం రాత్రి ఇంట్లో భోజనం చేసిన తర్వాత దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున నిద్రనుంచి లేచిన తల్లికి కుమారుడు దూలానికి వేలాడుతూ కనిపించాడు. దీతో ఆమె బోరున విలపించి చుట్టు పక్కల వారిని పిలిచి మృతదేహాన్ని కిందకు దించారు. యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియ రాలేదు. మృతుని తండ్రి గతంలో చనిపోయాడు. తమ్ముడు హైదరాబాద్‌లో ఉంటూ పని చేస్తున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. తల్లి వెంకటమ్మ ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment