వలస కూలీపై దాడి
● అస్వస్థతకు గురై మృతి
మదనాపురం: బతుకుదెరువు కోసం వలసవెళ్లిన కూలీపై ఓ వ్యక్తి దాడికి పాల్పడటంతో మృతిచెందింది. ఈ ఘటన మదనాపురం మండలం దుప్పల్లిలో కలకలం రేపింది. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. దుప్పల్లికి చెందిన రమేష్ నాయక్ భార్య కేత్లావత్ శాంతమ్మ (30) మూడు నెలల క్రితం కౌకుంట్ల మండలం అప్పంపల్లికి చెందిన రాఘవారెడ్డి అనే మేస్త్రి గుంపులో కరీంనగర్ జిల్లాకు వలస వెళ్లింది. అక్కడ పని విషయంలో లక్ష్మణ్ అనే వ్యక్తితో గొడవ జరిగింది. ఈ క్రమంలో శాంతమ్మపై దాడికి పాల్పడటంతో అస్వస్థతకు గురైంది. అక్కడి నుంచి ఆమె మంగళవారం రాత్రి ఇంటికి చేరుకొని జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. ఈ విషయంపై మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనుకున్నారు. రాత్రి కుటుంబ సభ్యులతో కలసి నిద్రించిన శాంతమ్మ.. తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందింది. మృతురాలికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ మేరకు మృతురాలి భర్త రమేష్ నాయక్ ఫిర్యాదు చేసినట్లు ఆత్మకూర్ సీఐ శివకుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment