అలంపురం.. ఆధ్యాత్మిక సంబురం
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవది అయిన అలంపూర్ జోగుళాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ఫిబ్రవరి 3 వరకు ఐదురోజుల పాటు కొనసాగనున్నాయి. ఏటా అమ్మవారి ఆలయంలో జరిగే ప్రముఖ ఉత్సవాల్లో వార్షిక బ్రహోత్సవాలు ప్రత్యేకమని.. వైభవోపేతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈఓ పురేందర్కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్రెడ్డి తెలిపారు. ఉత్సవాల చివరిరోజు సహస్ర ఘటాభిషేకం, అమ్మవారి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు కలగనుంది. జోగుళాంబ అమ్మవారు ఆరు దశాబ్దాలుగా బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో పూజలందుకుంటున్నారు. 2005, ఫిబ్రవరి 13 వసంత పంచమి రోజున అమ్మవారి ఆలయంలో పునః ప్రాణప్రతిష్ఠ జరిగింది. నాటి నుంచి నేటి వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి.
విద్యుద్దీపాల అలంకరణలో ఆలయం
పూజా కార్యక్రమాలు ఇలా..
గురువారం ఉదయం 8 గంటలకు యాగశాల ప్రవేశం, పుణ్యాహవాచనం, మహాగణపతి పూజ, రుత్విక్వరణం, మహా కలశస్థాపన పూజలు జరగనున్నాయి. సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణం నిర్వహించనున్నారు.
శుక్రవారం నుంచి ఫిబ్రవరి 2 వరకు విశేష అర్చనలు, చండీహోమాలు, పవమానసూక్త పారాయణం, పవమాన సూక్త హోమాలు, ఆవాహిత దేవతా హోమాలు, మండపారాధన, బలిహరణం, నీరాజన మంత్రపుష్ప పూజలు ఘనంగా కొనసాగనున్నాయి.
చివరిరోజు ఫిబ్రవరి 3 వసంత పంచమి రోజున ఉదయం 9 గంటలకు యాగశాలలో నిత్యహోమాలు, మహా పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, సహస్ర ఘటాలకు ఆవాహన అర్చన, అమ్మవారి మూల విగ్రహానికి అవభృతస్నానం, పంచామృతాలతో అభిషేకం, సహస్ర కలశాలతో అభిషేకం నిర్వహించనున్నారు. జోగుళాంబ అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు బాలబ్రహ్మేశ్వరస్వామి, జోగుళాంబ అమ్మవారి శాంతి కల్యాణం నిర్వహించనున్నారు.
నేటి నుంచి జోగుళాంబ వార్షిక బ్రహ్మోత్సవాలు
ఐదురోజుల పాటు కొనసాగింపు
ఆలయాల్లో ప్రత్యేక పూజలు.. నిజరూప దర్శన భాగ్యం
చివరిరోజు సహస్ర కలశాలతో అభిషేకం
భారీగా హాజరుకానున్న ప్రముఖలు, భక్తులు
ఏర్పాట్లు పూర్తి..
అలంపూర్ జోగుళాంబ అమ్మవారి వార్షిక బ్రహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించాం. అమ్మవారిని ప్రశాంత వాతావరణంలో భక్తులు దర్శించుకునేలా చూస్తాం.
– పురేందర్కుమార్, ఈఓ, అలంపూర్
Comments
Please login to add a commentAdd a comment